న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్న భారత రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యను వివరించగా చట్టం తన పని తాను చేస్తుందని వారికి హామీ ఇచ్చారు.
తొందరగా విచారణ చేయించండి...
కొద్ది రోజులుగా భారత రెజ్లర్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద కొన్నాళ్లపాటు సాగిన ఈ నిరసన నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున కీలక మలుపు తీసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఎలాగైనా ఆయనకు తమ గోడు చెప్పుకుందామని అటువైపుగా వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ పోలీసులు భారత రెజ్లర్లపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇన్నాళ్లుగా న్యాయంకోసం పోరాడుతుంటే ఎవరూ స్పందించకపోగా కేసులు పెట్టడం దారుణమని దీన్ని అవమానంగా భావించిన రెజ్లర్లు తాము సాధించిన పతకాలను గంగలో కలిపే ప్రయత్నం చేశారు. రైతు సంఘం నాయకులు నరేష్ తికాయత్ వారిని వారించగా ఆ ప్రయత్నాన్ని ఐదు రోజులపాటు వాయిదా వేశారు.
దీంతో చివరి ప్రయత్నంగా రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియాన్ లు కేంద్ర హోంమంత్రిని కలిసి రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్ పై త్వరితగతిన విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. అందుకు హోంమంత్రి స్పందిస్తూ... చట్టంపై నమ్మకముంచండి. చట్టరీత్యా జరగవలసింది జరుగుతుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment