నేడు రాహుల్‌ రాక | Sakshi
Sakshi News home page

నేడు రాహుల్‌ రాక

Published Sun, May 5 2024 3:25 AM

నేడు

జిల్లాకు మూడోసారి అగ్రనేత

నిర్మల్‌లో భారీ బహిరంగసభ

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ సన్నద్ధం

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క

నాలుగు నియోజకవర్గాల నుంచి

65వేల మంది జనసమీకరణ

నిర్మల్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదివారం జిల్లాకేంద్రానికి రానున్నారు. తమ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ప్రచారానికి ఇక్కడికి వస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు కూడా బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈమేరకు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌రోడ్డులో గల క్రషర్‌ గ్రౌండ్‌లో బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11గంటల వరకు రాహుల్‌గాంధీ సభాప్రాంగణానికి చేరుకుంటారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.

జిల్లాకు మూడోసారి..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జిల్లాకు రావడం ఇది మూడోసారి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 అక్టోబర్‌ 20న భైంసాకు వచ్చారు. అంతకుముందు తాను చేపట్టిన కిసాన్‌ సందేశ్‌యాత్రలో భాగంగా 2015 మే 14న రాత్రి నిర్మల్‌కు చేరుకుని బసచేశారు. మరుసటి రోజు మామడ మండలం కొరిటికల్‌ నుంచి లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించారు. రైతులతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. గత రెండుసార్లు వచ్చినట్లే ఇప్పుడు కూడా ఢిల్లీ నుంచి నాందేడ్‌కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా నిర్మల్‌కు రానున్నారు.

65వేల మందితో సభ..

రాహుల్‌గాంధీ మూడోసారి జిల్లాకు రానున్న నేపథ్యంలో తమ పార్టీ అధినేత బహిరంగసభను దిగ్విజయం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు శ్రమిస్తున్నాయి. దాదాపు 65వేలమంది జనసమీకరణ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. నిర్మల్‌ సభకు జిల్లాలోని నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలతోపాటు పక్కజిల్లా ఆదిలాబాద్‌లోని బోథ్‌ నియోజకవర్గం నుంచీ జనసమీకరణ చేస్తున్నట్లు ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి అధికసంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇన్‌చార్జి మంత్రితో పాటు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌, ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌ తదితరులు జనసమీకరణ, సభ విజయవంతం చేయడానికి పనిచేస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి..

జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ రోడ్డులో పాత క్రషర్‌ ఎదుట గల మైదాన ప్రాంతంలోనే రాహుల్‌గాంధీ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టెంట్లు, కుర్చీలు వేసి ఉంచారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండేలా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచనలు చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యే సభ స్థలిని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. నూతన కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో వాహనాల పార్కింగ్‌, జన సమీకరణపై చర్చించారు. జిల్లా పోలీసులు రాహుల్‌గాంధీ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ డైవర్షన్‌ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

నేడు రాహుల్‌ రాక
1/1

నేడు రాహుల్‌ రాక

Advertisement
Advertisement