దేశ విద్యావ్యవస్థకు మార్గదర్శకుడు ఆజాద్
● కలెక్టరేట్లో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
నిర్మల్‌చైన్‌గేట్: దేశ విద్యావ్యవస్థకు మార్గదర్శకుడు, విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. భారతరత్న, దేశ తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆజాద్ అందించిన సేవలను వక్తలు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించి, జాతీయ విద్యా విధానం అమలు చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కీర్తించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించడంతోపాటు విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్‌సింగ్, సీపీవో జీవరత్నం, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్, మెప్మా పీడీ సుభాష్, మైనారిటీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment