అర్కాయితండాలో అవగాహన కల్పిస్తున్న అధికారులు, ఘాట్స్‌పై రోడ్డు దాటిన పెద్దపులి, పులి ఆనవాళ్ల కోసం గాలిస్తున్న అటవీ అధికారులు
తోడు కోసం జిల్లాల అన్వేషణ..
ఆదివారం రాత్రి మహబూబా ఘాట్స్‌పై రోడ్డు దాటిన పెద్దపులి
మామడ మండలం తాండ్ర–గాయిద్‌పల్లి అటవీ ప్రాంతంలో సంచారం
సారంగపూర్: మహారాష్ట్ర నుంచి గత నెల 25న ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోకి వచ్చిన పెద్దపులి.. తాజాగా సహ్యాద్రి పర్వతశ్రేణిపై కనిపించింది. ఆదివారం రాత్రి సహ్యాద్రి పర్వతాలపై సారంగపూర్ మండలం చించోలి(బి) సమీపంలోని మహబూబా ఘాట్స్‌పై నుంచి రోడ్డు దాటింది. వాహనదారులు గమనించి సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాదాపు 20 రోజులు ఎవరి కంట పడకుండా తిరిగిన బెబ్బులి ఇప్పుడు ప్రజల కంట పడడంతో అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పులి సంరక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం సైతం పులి అన్వేషణ కొనసాగిస్తూనే సమీప గ్రామాలైన అర్కాయితండా, సోనాపూర్, గోపాల్‌పేట్ తండాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆడ పులి కోసం..
సాధారణంగా అక్టోబర్–జనవరి నెలల మధ్య మగ పులి ఆడపులికోసం అన్వేషణ సాగిస్తాయని అటవీశాఖ అఽధికారులు చెబుతున్నారు. జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి మగదని, దాని వయసు 6 నుంచి 8 ఏళ్లు ఉంటుదని తెలిపారు. తోడు కోసం జిల్లా అడవుల్లో సంచరిస్తోందని భావిస్తున్నారు. మహారాష్ట్రలోని తడోబా అడవుల్లో పులుల సంఖ్య పెరగడంతో జిల్లా అడవుల్లో అనువైన వాతావరణం ఉంటే స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.
మామడ అటవీ ప్రాంతంలోకి..
పెద్దపులి మహబూబా ఘాట్స్ మీదుగా రోడ్డు దాటి మామడ మండలంలోని తాండ్ర– గాయిద్‌పల్లి గ్రా మాల్లోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అధి కారులు నిర్ధారించారు. అయితే తాండ్ర గ్రామ సమీ పంలోని ఎన్‌హెచ్–44 దాటకుండా నేరుగా వెళ్తే నేరడిగొండ రేంజ్‌లోని ఆరేపల్లి, వాంకిడి, గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశాలున్నాయని అటవీ అధికారులు తెలిపారు. లేదంటే హైవేను దాటితే రాసిమెట్ల, గాయిద్‌పల్లి, మీదుగా మామడ, దిమ్మదుర్ది నుంచి ఖానాపూర్ డివిజన్‌లోకి ప్రవేశించి అటు నుంచి కవ్వాల్ అభయారణ్యంలో ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాండ్ర–గాయిద్‌పల్లి అడవిలో..
మహబూబా ఘాట్స్ వద్ద రోడ్డు దాటిన పెద్దపులి మామడ మండలంలోని తాండ్ర–గాయిద్‌పల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ప్రవేశించింది. ఈ ప్రాంతంలో తాగునీరు లభించే అవకాశం ఉన్నందున పులి ఇక్కడే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. పెద్దపులి సంరక్షణ కోసం అన్వేషణ కొనసాగుతుంది. ప్రజలను సైతం అప్రమత్తం చేస్తూ గాలింపు చేపడుతున్నాం.
– నజీర్‌ఖాన్, డీఆర్‌వో, సారంగాపూర్
Comments
Please login to add a commentAdd a comment