మళ్లీ పులి కదలిక
మామడ: జిల్లాలో మళ్లీ పులి కదలికలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జిల్లా అటవీ ప్రాంతం నుంచి పులి వెళ్లిందని.. ఇక ఏ భయం లేదని అటవీశాఖ అధికారులు అటవీ సమీప గ్రామస్తులకు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మరో పులి కదలికలు గుర్తించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పరిమండల్ సమీపంలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పరిమండల్ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అక్టోబర్ 25న కిన్వట్ బోథ్ మీదుగా పులి తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి జిల్లాలోని అడెల్లి ప్రాంతంలోకి వచ్చింది. కుంటాల, దిలావర్‌పూర్, నర్సాపూర్, మామడ, పెంబి, ఖానాపూర్, కడెం, ఉట్నూర్, నార్నూర్ మీదుగా వెళ్లి ప్రస్తుతం బేల మండలంలో సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం నుంచి..
తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి మళ్లీ అదే ప్రాంతం వైపు వెళ్తూ పశువులపై దాడి చేసి చంపి తిన్నది. మొదటి పులి వెళ్లిందని అనుకునేలోపే రెండో పులి జిల్లాలో సంచరిస్తోంది. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన పులి జన్నారం అభయారణ్యం మీదుగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మామడ, సారంగపూర్ అటవీప్రాంతంలో దాని కదలికలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. అక్టోబర్ నుంచి జనవరి వరకు మేటింగ్ సీజన్ కావడంతో మగపులులు ఆడపులి కోసం తిరుగుతుంటాయి. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి పశువులపై దాడి చేసి చంపి తిన్నదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ అటవీప్రాంతం నుంచి వచ్చిన పులి వయసులో మొదటి పులి కంటే చిన్నదని భావిస్తున్నారు. ఇది అటవీ జంతువులను వేటాడి తింటోందని, పశువులపై దాడి చేయకపోవచ్చని చెబుతున్నారు. రోజుకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు పులులు తిరుగుతుంటాయని తెలిపారు.
పులి కదలికలు గుర్తించాం
మామడ అటవీ పరిధిలో పులి కదలికలున్నాయి. పరిమండల్ సమీపంలో దాని పాదముద్రలు గుర్తించాం. సారంగపూర్ మండలం రాణాపూర్ అటవీపరిధిలో పులి సంచరిస్తోంది. అటవీప్రాంతంలోకి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– అవినాష్, ఎఫ్‌ఆర్వో, మామడ అటవీ క్షేత్రం
పరిమండల్‌లో పాదముద్రల గుర్తింపు
కాగజ్‌నగర్ ప్రాంతం నుంచి వచ్చినట్లు అధికారుల వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment