ఖలీల్‌వాడి: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారు ఉంగరాల బాక్సును దొంగిలించిన డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్లు నిజామాబాద్–1 డిపో మేనేజర్ ఆనంద్ మంగళవారం పేర్కొన్నారు. డిపో మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్–1 డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్సు ఆదివారం వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వస్తోంది. హన్మకొండ దగ్గర కొంత మంది ప్రయాణికులు బస్సు ఎక్కారు. ఓ మహిళా ప్రయాణికురాలు తన వద్ద ఉన్న బంగారు ఉంగరాల బ్యాగును డ్రైవర్ రామ్‌మోహన్‌రెడ్డి సీటు పక్కనే ఉండే బ్యానెట్‌పై ఉంచింది. బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో సదరు ప్రయాణికురాలు తన బ్యాగ్‌ను డ్రైవర్ పక్కన ఉంచాలని కోరడంతో అతను తన సీటు పక్కనే ఉంచాడు. అందులో బంగారు ఉంగరాలు ఉన్నట్లు గుర్తించిన డ్రైవర్ అదును చూసి బ్యాగులో ఉన్న ఉంగరాల బాక్సును బయటకు తీశాడు. ఇదంతా మరో ప్రయాణికుడు తన ఫోన్‌లో చిత్రీకరించాడు. కరీంనగర్ బస్టాండ్‌లో జరిగిన విషయం అందరికీ తెలియడంతో డ్రైవర్‌పై స్థానిక ఆర్టీసీ అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో డ్రైవర్ రామ్‌మోహన్‌రెడ్డి ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారాన్ని దొంగిలించినట్లు తేలడంతో విధుల నుంచి తొలగించినట్లు డిపో మేనేజర్ ఆనంద్ పేర్కొన్నారు.
ప్రయాణికురాలి బ్యాగు నుంచి
బంగారాన్ని దొంగిలించిన ఆర్టీసీ డ్రైవర్
విధుల నుంచి తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment