20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి USలో కట్టిన గుడి ! | Kanaka Durgamma Came To Northern California In America | Sakshi
Sakshi News home page

20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి USలో కట్టిన గుడి !

Published Mon, Jul 3 2023 12:56 PM | Last Updated on Fri, Jul 14 2023 3:50 PM

Kanaka Durgamma Came To Northern California In America - Sakshi

ఈ గుడి కథంతా తెలుగు సినిమా కథలా కనిపిస్తుంది. కాని ఇది యథార్థంగా జరిగిన ఘటన.  కాలిఫోర్నియాలో ఒక దేవాలయ నిర్మాణం విషయంలో. ఫేస్ బుక్ లో వల్లీశ్వర్ గుండు (Valliswar Gundu) షేర్ చేసుకున్న కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ యథాతధంగా..

1974 లో ఉత్తర కాలిఫోర్నియాలో హిందువుల కోసం ఒక దేవాలయం ఉండాలని కొందరు స్థానిక భారతీయులకు ఒక కోరిక కలిగింది. ఆ ఆలోచనకి ఒక రూపం వచ్చి 1977లో ఒక రిజిస్టర్డ్ కమ్యూనిటీగా ఏర్పడింది.  ప్లెసంటన్ అనే ప్రాంతంలో షాడో క్లివ్స్‌ అనే సరస్సు ప్రక్కన ఓ నాలుగెకరాల స్థలంలో దేవాలయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి తొలి విరాళంగా 50 వేల డాలర్లు (రూ. 4.50 లక్షలు అప్పట్లో) ఇచ్చిన భక్తుడు ఒక గుజరాతీ.

ఆయన పేరు గులు అద్వాణి. రకరకాల 'సాంకేతిక కారణాలు ' చూపిస్తూ స్థానిక పాలనా సంస్థ ఈ నిర్మాణానికి అభ్యంతరాలు తెలిపింది. ప్లెసంటన్ పౌరులు మూడు వేల సంతకాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ళపాటు పోరాడారు. ప్రయోజనం శూన్యం. ఆ భూమి క్రయాన్ని రద్దు చేసుకున్నారు. అక్కడికి తూర్పుగా తొమ్మిది మైళ్ళ దూరంలో నాలుగెకరాల భూమి కొన్నారు. సరైన రోడ్లు లేవు. విద్యుత్ నీటి సదుపాయాలు సరిగ్గా లేవు. అక్కడే 1983లో దేవాలయం కట్టాలనుకున్నచోట ఒక పాత ఇల్లు కొని, తమ కార్యాలయం చేసుకున్నారు. ఆ కార్యాలయానికి ప్రక్కనే ఆలయ క్షేత్ర భూమిలో సర్వశక్తిమంతురాలైన శ్రీ కనక దుర్గాదేవి మందిరానికి భూమి పూజ జరిగింది. గత నాలుగు దశాబ్దాలకు పైగా దేవాలయ అభివృద్ధిలో పాత్రధారిగా, అలుపెరగని సేవకురాలిగా, అన్ని పరిణామాలకి సాక్షిగా అనునిత్యం తరిస్తున్న నీలంరాజు విజయలక్ష్మి జ్ఞాపకాల్లోకి తొంగి చూస్తే..సంభ్రమం, ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఎన్నో!.


(నీలంరాజు విజయలక్ష్మి)

అప్పుడే అద్భుతం జరిగింది!
ఆమె మాటల్లో చెప్పాలంటే … 1982 ఆగష్టులో గణపతి స్థపతి గారు వచ్చి చూసి, అమ్మవారు ఉన్న చోట ఆగమ శాస్త్రం ప్రకారం ఏయే దేవతా విగ్రహాలు ఉండాలో చెప్పారు. 'పద్మశ్రీ' గ్రహీత ముత్తయ్య స్థపతి కూడా చూసి, కొన్ని సూచనలు చేశారు. దక్షిణభారత, ఉత్తర భారత శైలులు రెండిటినీ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఆ సూచనల ప్రకారం విష్ణ్వాలయానికి చోళ శైలి గోపురం, శివాలయానికి కళింగ శైలి గోపురం ఎంచుకున్నారు. గణేశ, శివ, కార్తికేయ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, హనుమ, కాల భైరవులకు నల్లని గ్రానైట్ విగ్రహాలు, రామకృష్ణులు, దశ భుజ దుర్గలకు పాలరాతి విగ్రహాలు ఎంచుకున్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది ! 1980 ప్రాంతంలో ఈ కమిటీ సారథుల్లో ఒకరైన శ్రీ ముత్తురామన్ అయ్యర్ శాన్‌ఫ్రాన్సిస్కోలో శివ-సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమెరికన్ స్వామీజీ తానే చొరవ తీసుకొని గణేశ, కార్తికేయ విగ్రహాలు ఇచ్చారు. కాని ఆలయం లేదు కదా! అందుకని వాటిని భక్తుల ఇళ్ళల్లో ఉంచి, వాటికి నిత్య పూజాభిషేకాలు జరిగేలా చూశారు.

సరిగ్గా ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. గుడి కట్టడానికి నిధులు కావాలి. భారతీయ స్టేట్ బ్యాంకు వారు "రుణం ఇస్తాం. హామీ ఏం పెడతారు?" అని అడిగారు. అంతే.. 20 మంది భక్తులు తమ ఇళ్ళను హామీగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు అయిదు లక్షల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షలు) రుణం తీసుకున్నారు. తరువాత ఇంకో అద్భుతం జరిగింది ! 1984 ప్రథమార్థంలో అమెరికా వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుని కమిటీ సభ్యులు కలిసి "టీటీడా వారి చేత మాకు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, స్వామి వారి అలంకారాలు ఇప్పించండి స్వామీ" అని కోరటం, వివేకానందుడి ఆహార్యంలో దర్శనమిచ్చిన ముఖ్యమంత్రి తక్షణం "అలాగే " అని హామీ ఇవ్వటం చకచక జరిగిపోయింది.

సరిగ్గా నెల తిరక్కుండా టీటీడీ నుంచి ఆగమ శాస్త్రానుసారం ఏకశిల గ్రానైట్ మీద చెక్కిన శ్రీనివాసుడి విగ్రహం, అలంకార సామగ్రి, వస్త్రాలు, పాత్రలు (మొత్తం లక్ష రూపాయల విలువ) కాలిఫోర్నియా చేరిపోవటం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం మంచి శిల్పుల్ని, కొన్ని విగ్రహాల్ని ఇస్తామని వాగ్దానం చేసింది. అప్పటికి చేతిలో ఉన్న విరాళాలతో కమిటీ 1984 ఏప్రిల్‌ దేవాలయ నిర్మాణానికి నిర్మాణానికి ఉపక్రమించింది. మళ్ళీ అమెరికా వచ్చిన ముఖ్యమంత్రి శ్రీఎన్.టి.రామారావు 1984 జూన్ 13 న ఆలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు. 


(నాడు పూజలో పాల్గొన్న ఎన్టీఆర్)

నా భక్తుడు నా కోసం వస్తాడు నన్ను పంపించు..
అప్పుడింకో అద్భుతం జరిగింది ! ఈ ఆలయ నిర్మాణానికి తపిస్తున్న భక్తుడు ముత్తురామన్ అయ్యర్ గారికి న్యూయార్క్ గణేశ దేవాలయ వ్యవస్థాపకులు అలిగప్పన్ గారు ఫోన్ చేసి, "మీకు అమ్మవారి విగ్రహం కావాలి కదా! మద్రాసు (చెన్నై)లో దేవీ భక్తుడు రిటైర్డ్ ఇంజినీర్ డాక్టర్ రాజు గారితో మాట్లాడండి" అని చెప్పారు. తరువాత ఆ ఇంజినీరే ఫోన్ చేశారు. ముత్తురామన్, తన భార్య గీతతో కలిసి మద్రాసు వెళ్తే, ఆ ఇంజినీర్, "ముత్తుస్వామి అనే భక్తుడు అమెరికాలో దేవాలయం కోసం వచ్చి నా విగ్రహం అడుగుతారు. నన్ను పంపించు" అని అమ్మవారు కొన్నేళ్ళక్రితమే తనకు చెప్పిందంటూ తన డైరీ చూపించారు. వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న ఆ విగ్రహం కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి స్పర్శతో దివ్యత్వాన్ని సంతరించుకున్నదని అంటూ ఆ విగ్రహాన్ని అమెరికా పంపించే ఏర్పాటు చేశారు.

అలా వచ్చిన అమ్మవారికి ముందు తాత్కాలిక వసతి కల్పించారు. తర్వాత ప్రతిష్ట చేశారు. శివలింగాన్ని, మరి కొన్ని విగ్రహాల్ని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది. ఇతర పాలరాతి విగ్రహాల్ని కమిటీయే సమకూర్చుకుంది. 1983 లో ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్ రవి శంకర్ శంకుస్థాపన చేసినా, ఈ ఆలయ సముదాయం నిర్మాణ పనులు మాత్రం అమ్మవారి విగ్రహం వచ్చాకనే వేగంగా పుంజుకున్నాయి. అయితే నిధులు లేక మొత్తం సముదాయానికి పైకప్పు నిర్మాణం చాలాకాలం పట్టింది. అలాంటి రోజుల్లో, చెదురుమదురుగా వచ్చే భక్తులు శివలింగం ముందర పైసలు (సెంట్లు) వేసేవారు. అలా 99 సెంట్లు ఎప్పుడు సమకూరితే అప్పుడే అయిదు లీటర్ల పాలు కొని శివుడికి క్షీరాభిషేకం చేసేవాళ్ళు. అంతదాకా జలాభిషేకాలే ! మూడు నాలుగేళ్ళు అలాగే జరిగింది. రాధాకృష్ణులు, శ్రీరామ పరివారం, నవగ్రహాలు, హనుమ, కాలభైరవ ... అందరూ స్థిరపడ్డాక, 1986లో తొలి కుంభాభిషేకంలో ఈ మందిరాల మీద హెలికాప్టర్లోంచి పుష్ప వృష్టితో కూడా అర్చించారు.

నిత్య పూజలతో పాటు కళ్యాణం, అభిషేకం వంటి సేవలన్నీ మొదలయ్యాయి. నలభయ్యేళ్ళు గడిచాయి. ఇప్పుడు 11 మంది అర్చకులు, ఆరుగురు ముఖ్య సిబ్బంది, ఇతరసహాయకులు, వారాంతాల్లో, ఇతర పర్వ దినాల్లో వచ్చి సేవలందించే వందమంది దాకా స్వచ్ఛంద సేవ చేసే భక్తులతో ప్రకాశిస్తున్న ఈ దేవాలయంలో ప్రతి పన్నెండేళ్ళకోసారి కుంభాభిషేకాలు జరుగుతున్నాయి.

పాలతో అభిషేకం చేయలేని స్థితి నుంచి నిత్యాన్నదానం ఇచ్చే..
మళ్ళీ ఓ అద్భుతం ! క్రమంగా ఆలయ అవసరాలు పెరుగుతున్నాయి. "ఏం చేద్దాం ?" అనుకుంటున్న రోజుల్లో అమెరికా వాసులైన ఆకెళ్ళ సోదరులు ముందుకు వచ్చి, ఆలయానికి అనుకుని ఉన్న భూమిని తమ తల్లిదండ్రులు ఆకెళ్ళ మనోరమ, ఆకెళ్ళ శాస్త్రి గారి పేరు మీద విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత డాక్టర్ హనుమరెడ్డి లక్కిరెడ్డి, డాక్టర్ పేరయ్య సూదనగుంట వంటి దాతలు సహా అనేక మంది విరాళాలతో ఆలయ సముదాయం భవనాలు, సదుపాయాలు విస్తరించాయి. ఇక్కడ ప్రముఖ పండితుల ప్రవచనాలు, క్రతువులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’గా ఈ దేవతా క్షేత్రం భాసిల్లుతోంది. ఒకప్పుడు శివలింగానికి పాలతో అభిషేకం చేసే స్తోమత లేని ఈ ఆలయంలో నేడు ప్రతి రోజూ అన్న ప్రసాదాలే. పర్వ దినాల్లో మూడువేల మందిదాకా భక్తులకు అన్న ప్రసాదాలు లభిస్తున్నాయి. ప్రతి జనవరి 1 నాడు ఎన్నో వేలమంది భక్తులు ఇక్కడి దేవతలను సేవిస్తుంటారు.. ఇప్పుడు కాలిఫోర్నియాలో అతి పెద్ద దేవాలయంగా లివర్ మోర్లో భక్తుల సేవలందుకుంటున్నది ఈ శివ-విష్ణు దేవాలయం (Hindu Cultural and Community Centre).

“తొలి భూమిపూజ నాడు దీపం వెలించే భాగ్యం నాకు లభించింది. అప్పట్నుంచీ, నేను మా వారు శ్రీనివాస రావు గారు ఈ సముదాయంలోని అన్ని ఆలయాల అభివృద్ధిలో పాత్రధారుల మయిపోయాం. మేనేజ్‌మెంటు కమిటీలో రక రకాల బాధ్యతల్లో ఉన్నాం. కొన్ని సంవత్సరాల పాటు నేను ప్రతిరోజూ 30 మైళ్ళ (50 కి.మీ) దూరం నుంచి దేవాలయానికి సేవలకోసం వచ్చేదాన్ని. ఇప్పుడు మంగళ, శుక్రవారాలు, పర్వదినాలు ....! అనేక అద్భుతాలతో, అనేకమంది దాతల విరాళాలతో, సేవలతో నిర్మాణమయింది ఈ దేవాలయం. గత నాలుగున్నర దశాబ్దాలలో ఇందులో ప్రతి మందిరంలోనూ మా చేత ఏదో ఒక పాత్రను ధరింపజేసి, ఈ దేవాలయంతో మా అనుబంధాన్ని అమ్మవారు సుసంపన్నం చేస్తోంది. పన్నెండేళ్ళకోసారి చొప్పున ఇప్పటిదాకా జరిగిన నాలుగు కుంభాభిషేకాల్లో ఉన్నాను. ఏనాడూ అమ్మవారు నన్ను విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఎంతకాలం ఆమె ఇలా శక్తినిస్తే, అంతవరకూ సేవిస్తూనే ఉంటాను..." అంటారు భక్తురాలు విజయలక్ష్మి.

(చదవండి: ధర్మచక్ర  ప్రవర్తనా  పూర్ణిమ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement