బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల ప్రేయసి జాస్మిన్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరూ ఫొటో షూట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా? లేదంటే కొద్ది మంది సమక్షంలోనే జరపనున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వీళ్లిద్దరూ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. కిందటి ఏడాది హలోవీన్ సందర్భంలో రింగ్ తొడిగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు సిద్ధార్థ్. అలా ఆ ప్రపోజల్‌తో ఈ జంట వార్తల్లోకి ఎక్కింది.
జాస్మిన్ ఇన్‌స్టా బయోలో యూఎస్ అని ఉంది. ఆమె ప్రొఫైల్‌ను బట్టి మాజీ మోడల్‌గా తెలుస్తోంది. ఇంతకి మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె కుటుంబ నేపథ్యం తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధార్థ్ నటుడిగా, మోడల్‌గా పరిచయస్థుడే.
విజయ్ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతులకు సిద్ధార్థ్ జన్మించాడు. కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో పుట్టి.. లండన్, యూఏఈలో పెరిగాడు సిద్ధార్థ్. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్ తరఫున ఆర్బీబీ డైరెక్టర్‌గానూ వ్యవహరించిన సిద్ధార్థ్.. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్‌ఫిషర్ మోడల్స్ జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్‌గా మారాడు. నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే.. ఆ తర్వాతే సిద్ధార్థ్ కెరీర్‌లో మార్పు కనిపించింది. మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ వైపు మళ్లిన సిద్ధార్థ్.. యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు.
ఇక.. సిద్ధార్థ్ తండ్రి విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఆయన భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్‌ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది. అతడు ఫ్రాన్స్‌లో 35 మిలియన్ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్‌మో హోల్డింగ్ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరో వైపు ఫ్రాన్స్ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment