వాలీబాల్ టోర్నీకి ఏర్పాట్లు పూర్తి
విజయవాడస్పోర్ట్స్: ఆల్ ఇండియా ఇన్విటేషన్ మహిళల వాలీబాల్ టోర్నీని విజయవాడ కేంద్రంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాదెళ్ల బసవ పూర్ణయ్య ట్రస్ట్ (ఎన్‌బీపీ) చైర్మన్ నాదెళ్ల బ్రహ్మాజీరావు తెలిపారు. డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో కొత్తగా నిర్మించిన ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ టోర్నీకి సంబంధించిన వివరాలను ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్‌బీపీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సెంట్రల్ రైల్వేస్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, గుజరాత్ స్పోర్ట్స్ హాస్టల్, ఐసీఎఫ్ (చెన్నయ్), సౌత్ సెంట్రల్ రైల్వేస్, సదరన్ రైల్వేస్ జట్లు లీగ్ పద్ధతిలో జరిగే ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తాయని తెలిపారు. విజేతలకు రూ.2.75 లక్షల నగదు బహుమతి, ట్రోఫీ, మెడల్స్ అందజేస్తామన్నారు. నగదు బహుమతిని జీఆర్‌జీ ట్రస్ట్(కోయంబత్తూరు) సమకూర్చినట్లు వెల్లడించారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతల సమక్షంలో ఈ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వాలీబాల్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని కష్ణాజిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి దోనేపూడి దయాకరరావు తెలిపారు. రోజూ నాలుగు మ్యాచ్‌లు చొప్పున నాలుగు రోజులు పాటు ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌బీపీ ట్రస్ట్ సభ్యులు నాదెళ్ల శ్రీనివాస్, నాదెళ్ల సాంబశివరావు, మోనికరావు, డాక్టర్ దేవేంద్రరాజా పాల్గొన్నారు. తొలుత టోర్నీకి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment