అర్జీలపై నోడల్ అధికారులు దృష్టిపెట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంలో నాణ్యతపై నోడల్ అధికారులు దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్‌లో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమ వారం జరిగింది. డీఆర్వో లక్ష్మీనరసింహం, డీఆర్ డీఏ పీడీ కె.శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై మొత్తం 85 అర్జీలు వచ్చాయి. వీటిలో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించి 42 అర్జీలు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా ఆయా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి, డీపీఓ పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
● ఖమ్మం– విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హై వే నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు గొల్లపూడి, జక్కంపూడి రైతులతో సమానంగా పరిహారం ఇవ్వాలని కోరుతూ పైడూరుపాడు గ్రామ రైతులు అర్జీ ఇచ్చారు. జక్కంపూడి రైతులకు రిజిస్ట్రేషన్ విలువను బట్టి ఎకరాకు రూ.76 లక్షలు, గొల్లపూడి రైతులకు రూ.76.3 లక్షల పరిహారం ఇస్తున్నారని, ఆ రెండు గ్రామాలకు సరిహద్దునే ఉన్న పైడూరుపాడు రైతులకు కేవలం రూ.11 లక్షలుగా నిర్ధారించారని, భూములు కోల్పోవడంతో పాటు పరిహారం విషయంలో నష్టపోతున్నామని, ఈ వ్యత్యాసాన్ని సరి చేయాలని కోరారు.
● విజయవాడ ఆరో డివిజన్ రావిచెట్టు ప్రాంతంలో రోడ్డుపైనే ఆకతాయిలు రోజూ రాత్రి రెండు, మూడు గంటల వరకూ గంజాయి, మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, తమ ప్రాంతంలో చోరీలు జరుగుతున్నాయని మొగల్‌రాజుపురానికి చెందిన పాలవలస కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
● కంచికచర్ల గ్రామంలో చెవిటికల్లు రోడ్డుకు ఇరువైపులా జెడ్పీ స్థలంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుని ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నామని, 2000 సంవత్సరం నుంచి అనేక సార్లు ఆ స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదని, ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలని ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కలెక్టర్‌ను కలిసి అర్జీ సమర్పించింది.
జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో 85 అర్జీలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment