రత్న భాండాగారంలో.. సొరంగాలు లేవు
● జనవరి నెల ఆఖరు నాటికి నిర్వహణ పనులు పూర్తి: మంత్రి
భువనేశ్వర్: పూరీ గన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరంలోని రత్న భాండాగారంలో అదనపు గదులు లేదా సొరంగాలు లేవని ఆలయం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. రాడార్ జీపీఆర్, జీపీఎస్ సర్వే ఈ విషయం తేటతెల్లం చేసిందన్నారు. ఈ వర్గాల సర్వే నివేదిక అధికారికంగా వెల్లడైందని సీఏఓ వివరించారు. హైదరాబాదుకు చెందిన సీఎస్‌ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూటు (ఎన్‌జీఆర్‌ఐ) రత్న భాండాగారం రాడార్ సర్వే నిర్వహించింది. భారత పురావస్తు శాఖ ఏఎస్‌ఐ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు.
శ్రీ మందిరం పటుత్వం, భద్రతపై పాలన యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని సీఏఓ హామీ ఇచ్చారు. రాడార్ సర్వే నివేదిక ఆధారంగా పరిరక్షణ, నిర్వహణ పనులు తక్షణమే ప్రారంభించేందుకు ఏఎస్‌ఐ అధికార వర్గాలతో తక్షణ సంప్రదింపులు ఆరంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యకలాపాల్లో భారత పురావస్తు శాఖ ఏఎస్‌ఐకి శ్రీ మందిరం పాలక వర్గం పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందజేస్తుందని అభయం ఇచ్చారు. ఈ మేరకు ఏఎస్‌ఐకి శ్రీ మందిరం పాలక వర్గం నుంచి లేఖ జారీ చేశారు. నివేదిక ఆధారంగా రత్న భాండాగారం సంరక్షణ, నిర్వహణ, మర్మతు పనుల కార్యాచరణ సమగ్ర సమాచారం తక్షణమే తెలియజేయాలని లేఖలో అభ్యర్థించారు. అనంతరం ఉభయ వర్గాలు ముఖాముఖి సమావేశమై రత్న భాండాగారం పనులు చేపట్టనున్నట్లు సీఏఓ వివరించారు. ఏఎస్‌ఐతో సంప్రదింపులు, చర్చలు పూర్తి కావడంతో ఛొత్తీషా నియోగుల ప్రతినిధులతో సమావేశమై రత్న భాండాగారం తుది కార్యాచరణ ఖరారు చేస్తారు.
ఛొత్తీషా నియోగుల సంప్రదింపులతో శ్రీ మందిరంలో రత్న వేదికపై మూల విరాటుల నిత్య, దైనందిన, ఉత్సవాది పూజాదులకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడతారు. అలాగే సాధారణ భక్తులకు దర్శన సౌలభ్యం కొనసాగిచేందుకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందిస్తారు.
సందిగ్ధత తొలగింది: మంత్రి
శ్రీ జగన్నాథుని రత్న భాండాగారంలో సొరంగాల్లో గుప్త నిధులు వగైరా సందిగ్ధతపై తెర తొలగిందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ తెలిపారు. రాడార్ సర్వే నివేదిక ఈ విషయం స్పష్టం చేసిందన్నారు. దీంతో రత్న భాండాగారం మరమ్మతు, నిర్వహణ కార్యకలాపాల తొలి దశ ముగిసింది. మలి దశ ప్రక్రియ అతి త్వరలో ఆరంభం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరియు చొత్తీషా నియోగుల సమన్వయ సంప్రదింపులతో ఈ పనులకు శ్రీకారం చడతారు.
రత్న భాండాగారంలో బంగారం, వెండి ఆభరణాలు, నగలు, పాత్రలు వంటి నిధిని సమ్రగంగా లెక్కించే ప్రక్రియని మలి దశ కార్యకలాపాల్లో పూర్తి చేస్తారు. మరమ్మతు, నిర్వహణ పనులతో ఆభరణాల లెక్కింపు వగైరా కార్యకలాపాల్ని వచ్చే ఏడాది జనవరి నెల ఆఖరు నాటికి ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి వివరించారు. ఒకటి, రెండు రోజుల్లో భారత పురావస్తు శాఖ ఏఎస్‌ఐ రత్న భాండాగారం మరమ్మతు పనులు ప్రారంభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
రత్న భాండాగారం నిర్వహణ, మరమ్మతు పనులతో ఆభరణాల లెక్కింపు చేపట్టేందుకు స్పష్టమైన మార్గదర్శకాల్ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా చేపడుతున్న నిర్వహణ పనులతో రత్న భాండాగారం మరో 100 ఏళ్లపాటు పటిష్టంగా కొనసాగేలా జాగ్రత్త వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment