ట్రక్ డ్రైవర్ సజీవ దహనం
భువనేశ్వర్: టోల్ గేటుకు ఢీకొన్న ప్రమాదంలో ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. ఈ మంటల్లో ట్రక్కు దగ్ధమై డ్రైవరు సజీవ దహనమయ్యాడు. శనివారం అర్ధరాత్రి ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడుకు సరుకు రవాణా చేస్తుండగా ఈ ప్రమాదానికి గురైంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ దుర్ఘటన సంభవించింది. టోల్ గేటు ఆరో నంబరు వరుసలో అతి వేగంగా దూసుకు వచ్చిన ట్ర క్కు ఇరు వైపులా ఉన్న రక్షణ కంచెని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి టక్క ఉన్న చోటనే కాలి బూడిదైంది. డ్రైవర్ బయటకు రాలేకపోయాడు. ఘటనలో టోల్ గేటు సిబ్బంది స్వ ల్పంగా గాయపడ్డారు. ఈ విషయం తెలియడంతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం ఘటనా స్థలం సందర్శించి మంటలు ఆర్పారు. ఈ ప్రమాదం ప్రేరేపించిన కారణాలు, పరిస్థితుల గూర్చి విచారణ చేపట్టారు. జలేశ్వర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి ఆవరణలో బైక్‌లు దగ్ధం
భువనేశ్వర్: నగరం శివారులోని గొఠాపట్న ప్రాంతంలో ఒకరి ఇంటి ఆవరణలో ఉన్న బైక్‌లు దగ్ధమయ్యాయి. ఆదివారం వేకువ జాము 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన దృష్టికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. గొఠపట్న ప్రాంతంలో సంతోష్ మహంతి అనే వ్యక్తి ఇంటి ఆవరణలో నిలిపిన 3 బైకులు, ఒక స్కూటీ మంటల్లో దగ్ధమయ్యాయి. రోజూ మాదిరిగా రాత్రి పూట బైక్‌ల్ని ఇంటి ఆవరణలో నిలిపి ప్రధాన ప్రవేశ మార్గం గేటు తాళం వేసి నిద్ర పోయారు. వేకువ జాము 3 గంటల ప్రాంతంలో మంటలు రగిలిన సంకేతాలు లభించడంతో ఇంటిల్లిపాదీ బయటకు వచ్చి చూసే సరికి మంటల్లో దగ్ధమైపోతున్న బైక్‌లు కనిపించాయి. దుండగుల్ని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు చందకా ఠాణా పోలీసుల్ని అభ్యర్థించారు.
ఆకట్టుకున్న నృత్య పోటీలు
జయపురం: ప్రాచీన సంస్కృతి, కళలు, నృత్య, నాట్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జయపురం తరుణ ప్రజ్ఞాభారతి ప్రతీ ఏడాది వివిధ పోటీలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆదివారం స్థానిక నారాయణీ ఆంగ్ల కళాశాల ప్రాంగణంలో చిన్నారులకు నృత్య, సంగీత, ఆదివాసీ, దేశభక్తి పాటల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో పట్టణంలో గల వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల మధ్య ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు తరుణ ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు తపన కిరణ్ త్రిపాఠీ, ఉపాధ్యక్షుడు రామ శంకర షొడంగి, సహాయ కార్యదర్శి అజయ్ కుమార్ మల్లిక్, కోశాధికారి రబీంద్ర మహరణ, ఇతర సభ్యలు నిర్వహించారు. ఈ పోటీల న్యాయ నిర్ణేతలుగా మహమ్మద్ షరీఫ్, శంకర దళపతి, అనిత బెహర, గీతా జయంతి పాత్రో, ఇతిశ్రీ సుబుద్ధి, జానకీ పాణిగ్రహి, సబిత త్రిపాఠీ, తదితరులు పాల్గొన్నారు. డిసంబర్ 1వ తేదీ ఆదివారం గీతా శ్లోకాలు, చర్చలు, సంస్కృతిక జ్ఞానం పరీక్షలు నిర్వహిస్తామని అధ్యక్షుడు తపన కిరణ్ త్రిపాఠీ వెల్లడించారు.
డ్రోన్ సహాయంతో గుర్తించి.. గంజాయి తోట ధ్వంసం
రాయగడ: కొద్ది రోజులుగా జిల్లా పోలీస్, అబ్కారీ శాఖ అధికారులు గంజాయి అక్రమ సాగుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో డ్రోన్ల సహాయంతో గంజాయి సాగువుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించిన ప్రాంతాల్లో విస్తృతంగా దాడులను నిర్వహించి గంజాయి వనాలను ధ్వంసం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని గుడారి పోలీస్ స్టేషన్ పరిధి తంగరమ అటవీ ప్రాంతంలో గంజాయి సాగవుతుందని గుర్తించిన పోలీసులు, అబ్కారీ సిబ్బంది శనివారం సాయంత్రం ఆకస్మికంగా దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదు ఎకరాల విస్తీర్ణంలోని 15 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment