పూరీలో రాష్ట్రపతి పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. డిసెంబరు నెల 4వ తేదీ నుంచి రాష్ట్రపతి పర్యటన ప్రారంభం కానుంది. పూరీ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో నేవీ డే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మందిరం సందర్శించి శ్రీ జగన్నాథుని దర్శించుకుంటారు. అనంతరం గోపబంధు ఆయుర్వేద కళాశాల వజ్రోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. భారత రాష్ట్రపతి పర్యటన ఆద్యంతం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లుని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ వైబీ ఖురానియా ఆది వారం సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ శ్రీ మందిరం, బ్లూ ఫ్లాగ్ బీచ్, ఆయుర్వేద కళాశాల ప్రాంగణాలు ప్రత్యక్షంగా సందర్శించారు. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 300 మంది సీనియర్ పోలీసు అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో 80 ప్లాటూన్ల పోలీసుల్ని భద్రతా కార్యకలాపాలకు నియమిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి పూరీ, పూరీ పట్టణ వ్యాప్తంగా వాహనాల కదలికపై ప్రత్యేక నియంత్రణ వ్యూహం ఖరారు చేశారు. నావికా దినోత్సవం పురస్కరించుకుని 25 ఓడలతో 40 ఎయిర్ క్రాఫ్టులతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు విచ్చేసిన సాధారణ ప్రజానీకం భద్రత, రక్షణ పట్ల పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని పోలీసు అధికారులు డీజీపీకి వివరించారు.
ఏర్పాట్లు సమీక్షించిన డీజీపీ
80 ప్లాటూన్ల పోలీసులతో భద్రత
300 మంది అధికారుల పర్యవేక్షణ
Comments
Please login to add a commentAdd a comment