హడలెత్తించిన మంత్రి
భువనేశ్వర్: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ కార్యకలాపాల్ని నగరాభివృద్ధి శాఖ మంత్రి డాక్టరు కృష్ణ చంద్ర పాత్రో ఆదివారం ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మయూర్‌భంజ్ జిల్లా బంగిరిపొషి ఘాటీ ప్రాంతం సందర్శించారు. నిర్దారిత కాల పరిమితిలో రహదారి విస్తరణ వగైరా పనులు పూర్తి చేయించడం పట్ల విభాగం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంది. లోగడ రెండు సార్లు మంత్రి ఈ ప్రాంతం ప్రత్యక్షంగా సందర్శించి సంబంధిత అధికారులతో స్పందించారు.
తాజాగా ఆదివారం మూడో సారి బంగిరిపొషి ఘాటీ ప్రాంతం రహదారి విస్తరణ పనుల పురోగతి సమీక్షించేందుకు మంత్రి సందర్శించారు. ఈ పనులు మందకొడిగా సాగుతున్నట్లు నిర్ధారించిన మంత్రి సంబంధిత అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి ఫోన్ ద్వారా సంప్రదించారు. పనుల మందకొడితనంపై ఘాటుగా నిలదీశారు. ఈ క్రమంలో జాతీయ రహదారి అధికార వర్గం ఎన్‌హెచ్‌ఏఐని హడలెత్తించారు.
హడలెత్తించిన ఫోన్ సంభాషణ
49వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనుల సమీక్ష సమయంలో సంబంధిత అధికారుల గైర్హాజరు నిర్లక్ష్య వైఖరికి తార్కాణమని, ఈ అలసత్వమే పనుల మందకొడికి కారణమని, కుంటి సాకులు చెబుతు కాలక్షేపం చేసేందుకు నూకలు చెల్లాయని అన్నారు. 2, 3 రోజుల్లో పనులు పూర్తి కాకుంటే జైలులో పడేయడం లేదా సస్పెండు చేయడం తథ్యమని బాహాటంగా హెచ్చరించారు. నడి రోడ్డు మీద జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంట్ వంటి ఉన్నతాధికారుల సమక్షంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఫోన్ చేసి తారస్థాయిలో మండి పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment