నరసరావుపేట టౌన్: రెండు దారి దోపిడీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ సెషన్స్ న్యాయాధికారి పూర్ణిమ బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. 2021 డిసెంబర్ 6న యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన మద్దు వీరయ్య తన భార్యతో గుంటూరు వెళ్లి స్వగ్రామానికి వస్తుండగా బోయపాలెం వద్ద ఎనిమిది మంది దాడి చేశారు. వారి నుంచి రూ.2,300 నగదు, మరో ఘటనలో డిసెంబర్ 7న సొలసకు చెందిన పోనుగుపాటి వీరాంజనేయులుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి రూ.2,000 దోచుకున్నారు. రెండు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆకుల లింగమయ్య, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అమ్మవరం గ్రామానికి చెందిన దాసరి ఓబులేసు, నంద్యాల పట్టణానికి చిన్న ఇండ్ల రమణయ్యతో పాటు మరో ఐదుగురిని నిందితులుగా గుర్తించి, అరెస్ట్ చేశారు. చోరీకి గురైన సొత్తును వారి నుంచి స్వాధీనం చేసుకొని కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. బెయిల్‌పై విడుదలైన వారిలో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. మిగతా ముగ్గురు నిందితులకు గతంలో ఓ కేసులో 20 సంవత్సరాలు శిక్ష పడటంతో ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ ముగ్గురిపై మరో రెండు నేరాలు సైతం రుజువు కావడంతో ఒక్కొక్క కేసులో నిందితులకు ఐదు సంవత్సరాల చొప్పున జైలు శిక్ష మొత్తాన్ని ఏకకాలంలో అనుభవించేలా న్యాయాధికారి తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment