పవన కల్యాణ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
పార్వతీపురంటౌన్: వలంటీర్లపై డీప్యూటీ సీఎం పవన కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌వీఎస్ కుమార్ డిమాండ్ చేశారు. వలంటీర్ వ్యవస్థే లేదని వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం వలంటీర్ల యూనియన్ ఆధర్యంలో స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజున శుభవార్త చెబుతాం అని చెప్పిన మాటను మరిచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు వలంటీర్ వ్యవస్థే లేదని అసెంబ్లీలో చెప్పడమంటే మీలో మీరే పొంతన లేని ప్రకటనలు చేసి వలంటీర్ల మనోభావాలతో ఆడుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలంటీర్లకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చిన తరువాత వారికి నెలకు రూ.10,000 వేతనం ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. వారిని విధుల్లోకి తీసుకుని ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సింహాద్రి దుర్గారావు, వార్డు, గ్రామ సచివాలయాల వలంటీర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి. అశోక్, జిల్లా నాయకులు పి.కుమార్, బి.రామకృష్ణ, ఎం.శ్రావణి, బి. క్రాంతికుమార్, బి.రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment