సీఆర్‌టీలుగా మార్చండి
● అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల
డిమాండ్
● కలెక్టరేట్ వద్ద ఆందోళన
పార్వతీపురం: గిరిజన గురుకులాల్లో అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమను సీఆర్‌టీలుగా మార్పుచేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ, గిరిజన సంక్షేమసంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఎం, సీపీఐ సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు రెడ్డివేణు, కె.మన్మథరావులు మాట్లాడుతూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఆదుకోవడం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలు తొలగించే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను సీఆర్టీలుగా గుర్తించి సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ నుంచి మినహాయించాలి
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట రమేష్, గిరిజన సంక్షేమసంఘం ఉత్తరాంద్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్‌లు మాట్లాడుతూ జోనల్ పోస్టులను డీఎస్సీలో ఎలా కలిపారని ప్రశ్నించారు. డీఎస్సీ నుంచి గిరిజన గురుకుల బోధనా పోస్టులు మినహాయించాలని డిమాండ్ చేశారు. 2022 పీఆర్‌సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన డ్వామా పీడీ రామచంద్రరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్‌తో సమస్యను చర్చించి అవసరమైన చర్యలను చేపట్టడం జరుగుతుందని డ్వామా పీడీ ఈ సందర్భంగా వారికి తెలిపారు. తొలుత పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా విచ్చేశా రు. శ్రామిక మహిళా సంఘం జిల్లా నాయకురాలు వి.ఇందిర, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్, పీడీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి సోమేష్, పి.సురేష్‌తోపాటు పలువురు పాల్గొఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment