మహిళలు మరింత చైతన్యవంతులు కావాలి
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ● గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభం
పార్వతీపురం: మహిళలను మరింత చైతన్య పరిచేందుకే అవగాహన ర్యాలీలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సీ్త్ర హింస నిరోధక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింస, బాలికలపై దాడులు, బాల్య వివాహాలు తదితర అకృత్యాలను అరికట్టేందుకు మహిళలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై అవగాహన ర్యాలీలను, అవగాహన సదస్సులను ఈ నెల 25 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు గృహహింస, పోక్సో, బాల్య వివాహాల నిషేధిత చట్టాలు రూపొందాయని పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళలపట్ల లైంగిక వేధింపులు, అనైతికంగా బాలికలను రవాణా చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో అవగాహనపై పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఎంఎం రాణి, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీఈఓ ఎన్. తిరుపతినాయుడుతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment