ఉన్నతాధికారుల మన్ననలు పొందే జిల్లాస్థాయి అధికారులు కొద్దిమందే ఉంటారు. ఎంత బాగా పని చేసినా..ఏదో ఒక సందర్భంలో పై అధికారుల నుంచి చీవాట్లు పడుతూనే ఉంటాయి. కొంతమందిని ఆ శాఖకు సరెండర్ చేసేయడం..లేదంటే బదిలీపై పంపించేయడం వంటి ఘటనలు చూస్తుంటాం. కానీ..పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటైన నాటి నుంచి ఇక్కడ ఉండేందుకు ఏ ఒక్క అధికారీ ఇష్టపడడం లేదు. బదిలీలపై వెళ్తున్న వారే గానీ.. ఆ స్థానంలో వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఫలితంగానే పదుల సంఖ్యలో కీలక విభాగాల్లో అధికారుల పోస్టులు ఖాళీగానే ఉండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది అధికారులు మాత్రం ఇక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారు. అందులో ఆయన ఒక్కరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయనను వేరే జిల్లాకు బదిలీ చేశారు. అయినప్పటికీ నేటికీ ఆయన ఇక్కడ రిలీవ్ కాకపోవడం విశేషం. మరోవైపు ఏ శాఖలో అధికారి పోస్టు ఖాళీ అయినా ఆయనకే ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి పోస్టులో ఇన్‌చార్జిగా వ్యవహరించేవారు. కొద్దిరోజుల క్రితమే ఆ స్థానానికి రెగ్యులర్ అధికారి కొండలరావు వచ్చారు. గ్రామ, వార్డు సచి వాలయం జిల్లా నోడల్ అధికారిగా రామగోపాల్ నియమితులైన వరకు ఆయనే అదనపు బాధ్యతలు చూసేవారు.
ఆ అధికారి అంటే
అంత నమ్మకమా?
జిల్లా బాస్‌గా ఎవరొచ్చినా..ఆయనకు ప్రాధాన్యం ఉంటోంది. ఆయనది కీలకమైన విభాగం కావడం ఒక ఎత్తయితే.. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంలో ఆయన దిట్ట అని ప్రజా, కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులను వేధించడంతోపాటు.. అవినీతి వ్యవహారాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఆయన ‘స్థానానికి’ మాత్రం ఎటువంటి ఢోకా ఉండడం లేదు. ఎప్పుడూ ఆయన స్థానం నంబరు 2గానే ఉంటుందని గిరిజన సంఘ నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రుల అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే ఆయన జిల్లాలో ‘కీలకం’గా వ్యవహరిస్తున్నారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment