సీఎం కేసీఆర్‌తో కామారెడ్డి నియోజకవర్గంలో తలపడేందుకు రెడీ అయిన బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. విభిన్నమైన ఆలోచనలు చేస్తున్నారు. రూ. 150 కోట్ల సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. శనివారం ఆయన కామారెడ్డిలో సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. – సాక్షి, కామారెడ్డి
మేనిఫెస్టో ఇలా..
♦ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో రెండెకరాల విస్తీర్ణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి అందులో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తా. ఇందుకోసం రూ.8 కోట్లు అవుతాయి.
♦ రెండెకరాల్లో మోడల్ స్కూల్ నిర్మించి ఇంటర్ వరకు విద్య అందిస్తాం. పిల్లల కోసం రవాణా సౌకర్యం కూడా కల్పిస్తాం. దీనికి రూ.5.60 కోట్లు వెచ్చిస్తా.
♦ రూ.2 కోట్లతో రైతు సేవా కేంద్రం, రూ.కోటిన్నరతో క్రీడా ప్రాంగణం, రూ.కోటితో ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా.
♦ రాజంపేట, పాల్వంచ, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండల కేంద్రాల్లో రూ.8.25 కోట్ల చొప్పున వెచ్చించి జనరల్ ఆస్పత్రి, మోడల్ స్కూల్, క్రీడా శిక్షణ కేంద్రం, రైతు సేవా కేంద్రం, ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తా.
ప్రజా ఉద్యమాలతో గుర్తింపు..
వెంకటరమణారెడ్డి నాలుగైదేళ్లుగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు, రైతులకు జరిగే నష్టంపై ఆయన చేసిన పోరాటం సంచలనమై రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు వ్యాపించింది.
ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పైరవీలకు తావులేకుండా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు ఇప్పటివరకు సుమారు రూ.50 కోట్ల వరకు విరాళం అందించారు. రాజకీయాల కోసం కాకుండా సేవ చేయాలన్న లక్ష్యంతో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నానని, తన ఆస్తులు అమ్మి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని వెంకటరమణారెడ్డి పేర్కొంటున్నారు.
మహానేత డాక్టర్ వైఎస్సార్ స్ఫూర్తి..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌లు నాకు స్ఫూర్తి. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అహర్నిశలు పాటుపడిన అరుదైన నాయకుడు వైఎస్సార్. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం, వారితో కలిసి ఫొటో దిగడం ద్వారా ఎంతో మందికి ఆయన చేరువయ్యారు. నేను గెలిచినా, ఓడినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా. – వెంకటరమణారెడ్డి, బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment