సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ఆప్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీకి కాంగ్రెస్ వెనకడుగు వేస్తే హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు తమ పార్టీ సుముఖంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ఒకరు తెలిపారు.
ఆప్ నేత అనుజ్ నాథూరామ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతలు పోటీ చేసేందుకు సంకోచిస్తే నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయమై పార్టీ హైకమాండ్‌తో మాట్లాడుతాం’ అన్నారు. రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యంపై కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన ఆప్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ మొదట పోటీ చేయడానికి నిరాకరించారు. అయితే మండి పార్లమెంటరీ సెగ్మెంట్ నుండి భారతీయ జనతా పార్టీ (BJP) నటి కంగనా రనౌత్‌ను పోటీకి దింపుతుండటంతో ఆమె తన నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటే ఆప్ మద్దతునిస్తుందని చౌహాన్ తెలిపారు. అయితే, కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆప్ తన అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలు, ఆరు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఉప ఎన్నికలతో పాటు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment