బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ..: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy comments on Lok Sabha results | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ..: సీఎం రేవంత్‌రెడ్డి

Published Thu, Jun 6 2024 4:30 AM | Last Updated on Thu, Jun 6 2024 4:30 AM

CM Revanth Reddy comments on Lok Sabha results

అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు తెచ్చుకున్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు 16 శాతానికి పడిపోయింది 

22 శాతం బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు 

లోక్‌సభ ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు అవయవ దానం చేశారు 

బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఏడు చోట్ల డిపాజిట్‌ కోల్పోయింది 

మా పాలనను మెచ్చుకున్న ప్రజలు ఓట్లు, సీట్లను పెంచి ఆశీర్వదించారు 

మేము, అభిమానులు ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాల్లేవు

సాక్షి, హైదరాబాద్‌: ‘అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 37.5 శాతం ఓట్లు తెచ్చుకున్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు 16 శాతానికి పడిపోయింది. 22 శాతం బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు. 2023 ఎన్నికల్లో 13 శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి ఇప్పుడు 35 శాతం వచ్చాయి. సరిగ్గా బీజేపీకి పెరిగిన ఓట్ల శాతమే బీఆర్‌ఎస్‌కు తగ్గింది. కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు కలిసి బీఆర్‌ఎస్‌ నేతల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. తనంతట తాను అంతర్థానమై బీజేపీని గెలిపించే దురాగతానికి కేసీఆర్‌ పూనుకున్నాడు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

బూడిదైన బీఆర్‌ఎస్‌ మళ్లీ పుట్టేది లేదు 
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీకి కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ఆత్మ బలిదానం చేసుకుని, అవయవ దానం చేశారు. బీజేపీ గెలిచిన 8 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఏడు చోట్ల డిపాజిట్‌ కోల్పోయింది. సిద్దిపేటలో ఎప్పుడూ బీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ వచ్చేది. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో హరీశ్‌రావు తన ఓట్లను బీజేపీకి బదిలీ చేశాడు. అక్కడ రఘునందన్‌రావుకు 63 వేలు వస్తే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 65 వేలు మాత్రమే వచ్చాయి. 

కేసీఆర్, హరీశ్‌లిద్దరూ బీఆర్‌ఎస్‌ ఓట్లను పూర్తిగా రఘునందన్‌ రావుకు బదిలీ చేయించి మెదక్‌లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన బలహీన వర్గాల అభ్యర్ధింని ఓడించారు. నమ్మి బీఆర్‌ఎస్‌ తరఫున నిలబడిన వెంకట్రామిరెడ్డిని మోసం చేశారు. సిద్దిపేటలో జరిగిన నష్టం కారణంగానే కాంగ్రెస్‌ మెదక్‌లో ఓడిపోయింది. మా ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేసీఆర్‌ నిరంతరం ప్రయతి్నస్తూనే ఉంటాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంత కాలం కుట్రలు కొనసాగుతాయి. ఆయన రాజకీయ జూదగాడు. బూడిద అయిన బీఆర్‌ఎస్‌ మళ్లీ పుట్టేది లేదు.’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.  

మాకివి ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు   
‘లోక్‌సభ ఎన్నికల్లో మాకు ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు వచ్చాయి. కొంత తీయగా, కొంత చేదుగా, కొంత పుల్లగా ఉంది. కానీ పచ్చడి మంచిది. ఇప్పుడొచ్చిన ఫలితాలను పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడిలా స్వీకరిస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లతో 65 ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐలు విజయం సాధించాయి. ఇప్పుడు 41 శాతం ఓట్లతో  64 స్థానాల్లో ఆధిక్యతను నిలబెట్టుకోవడంతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ను గెలుచుకున్నాం. అయితే ఫలితాలు మేము, అభిమానులు ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. ఇప్పటివరకు 18 గంటలు పనిచేశాం. ఇంకా రెండు గంటలు అదనంగా పనిచేస్తాం..’ అని సీఎం చెప్పారు.  

మా పాలనను ప్రజలు సమర్థించారు 
‘ఈ ఎన్నికలు మా పాలనకు రిఫరెండం అని చెప్పాం. మా పాలనను మెచ్చుకున్న ప్రజలు ఓట్లు, సీట్లను పెంచి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు. వారి శ్రమ, కష్టం, ప్రయత్నం వల్లనే ఓట్ల శాతం, పార్లమెంటు సీట్లు, ఎమ్మెల్యే స్థానాల్లో మెజార్టీ వచ్చింది. మా గౌరవాన్ని, రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని పార్టీ శ్రేణులు నిలబెట్టాయి. రాహుల్‌గాంధీ చేపట్టిన దేశవ్యాప్త యాత్రలు, ఇండియా కూటమి ఏర్పాటు, నేతల మధ్య సమన్వయంతో పాటు మోదీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలనా వైఫల్యాలకు దేశ స్థాయిలో ప్రచారం కల్పించడం ద్వారా ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం..’ అని రేవంత్‌ అన్నారు. 

గెలుపోటములకు నాదే బాధ్యత 
‘మల్కాజిగిరి సిట్టింగ్‌ ఎంపీ సీటు కోల్పోయినా కంటోన్మెంట్‌ అసెంబ్లీని గెలుచుకున్నాం. మహబూబ్‌నగర్‌లో కూడా ఓడిపోయాం. ఇవన్నీ ప్రజాతీర్పులో భాగం. ప్రజలు ఏ తీర్పునిచ్చినా శిరసావహిస్తాం. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని..జిల్లాకు కాదు. అలాగే పీసీసీ అధ్యక్షుడిని కూడా రాష్ట్రానికే. ఈ రాష్ట్రంలో ఏ సీటు ఓడినా, గెలిచినా నాదే బాధ్యత. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత..’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  

మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు 
‘2024లో మోదీ గ్యారంటీ అంటూ ఏకవ్యక్తి నాయకత్వంతో ప్రజల దగ్గరికెళితే బీజేపీని దేశ ప్రజలు తిరస్కరించారు. ఆ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని, మోదీకి కాలం చెల్లిందని తీర్పిచ్చారు. ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీని చీల్చడం ద్వారా కుట్రలు, కుతంత్రలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. అక్కడ తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తుందో లేదో చూడాలి. ప్రపంచంలోనే కేసీఆర్‌ అత్యంత అవినీతిపరుడని, అవినీతి కుటుంబమని ఆరోపణలు చేసిన బీజేపీ వారితోనే ఎలా జట్టు కడుతోందో, ఎలా సమర్ధింస్తోందో ఆ పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలి. మోదీ తక్షణమే ప్రధాని పదవికి రాజీనామా చేసి మళ్లీ ఆ పదవిని చేపట్టకూడదు..’ అని సీఎం అన్నారు.  

ఏపీతో సమస్యలు చర్చలతో పరిష్కరించుకుంటాం 
‘ఏపీ ప్రజల తీర్పును జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబులు స్వాగతించిన తర్వాత మాదేముంటుంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా స్నేహపూర్వక వాతావరణంలో చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటామని ముందే చెప్పా. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నా. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి కట్టుబడి ఉన్నాం..’ అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మల్లురవి, చామల కిరణ్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement