నా సంకల్పం చెదరదు: సీఎం జగన్‌ | CM YS Jagan Speech Highlights At Memantha Siddham Sabha At Gudivada, Details Inside - Sakshi
Sakshi News home page

నా సంకల్పం చెదరదు: సీఎం జగన్‌

Published Tue, Apr 16 2024 4:39 AM | Last Updated on Tue, Apr 16 2024 4:12 PM

CM YS Jagan Comments At Memantha Siddham Sabha At Gudivada - Sakshi

కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

ఎవరెన్ని కుట్రలు పన్నినా బెదరను.. గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ 

వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే.. వాళ్లు ఓటమిని అంగీకరించినట్లే

ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు.. మీ బిడ్డ జగన్‌.. నాపై ఒక రాయి విసిరినంత మాత్రాన యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్లు కాదు 

పేదలకు మంచి చేయకూడదనేదే చంద్రబాబు ఫిలాసఫీ.. ఎన్టీఆర్‌ను దింపేసి కిలో రూ.2 బియ్యం రూ.5.20 చేసింది బాబే 

ఇంగ్లిష్‌ మీడియం వద్దన్నది.. ప్రభుత్వ బడులను పాడుబెట్టిందీ చంద్రబాబే 

పేదల ఇళ్లకు అడ్డుపడి సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ కోర్టుకెక్కారు 

సచివాలయాలు, వలంటీర్, ఆర్బీకేలు, విలేజ్‌ – అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు, స్కూళ్లు, మహిళా పోలీసులు, డిజిటల్‌ లైబ్రరీలు.. ఇవీ మీ జగన్‌ ఏడు వ్యవస్థలు  

మీ బిడ్డ జగన్‌ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల ప్రభుత్వం గెలుపుని ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే.. వాళ్లు ఓటమిని అంగీకరించారని అర్థం.
– గుడివాడ సభలో సీఎం జగన్‌  

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బెదిరే ప్రసక్తే లేదని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో నిలవడం చేతకాని వారు ఎన్ని మాటలు మాట్లాడినా లెక్క చేయబోనన్నారు. 15వరోజు బస్సుయాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లా గుడివాడ శివారు నాగవరప్పాడులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఒక్క జగన్‌పై.. పదిమంది కుట్రదారుల దాడి
గుడివాడలో ఈరోజు మహా సముద్రం కనిపిస్తోంది. ఇది జన సముద్రం. మే 13న జరగనున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజా సముద్రం ఇది. పేదల భవిష్యత్తు కోసం.. పథకాలన్నీ కాపాడుకోవడానికి.. కొనసాగించేందుకు.. ఇంటింటి అభివృద్ధి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? పేదలకు మంచి చేస్తూ 130 బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కేందుకు, మరో వంద మందితో నొక్కించేందుకు స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచారానికి మీరంతా సిద్ధమేనా? రాష్ట్ర భవిష్యత్తు, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే మీ సెల్‌ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయండి. ప్రజలకు మంచి చేశానన్న ధైర్యంతో నిలబడ్డ మీ ఒక్క జగన్‌పై మోసాలే అలవాటుగా పెట్టుకున్న పదిమంది కుట్రదారులు దాడి చేస్తున్నారు. 

తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ బెదరడు..
చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, బీజేపీ, కాంగ్రెస్‌.. కుటిల పద్మవ్యూహంతో ఒక్కటై మీ జగన్‌ మీద బాణాలు సంధిస్తున్నాయి. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీ సేవకుడిగా ఉన్న మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు. అయినా సరే మీ బిడ్డ అదరడు, బెదరడు. కారణం.. ప్రజలు అనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. అర్జునుడి మీద ఓ బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రం గెలిచినట్లు కాదు.

జగన్‌ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఆ దుష్టచతుష్టయం, పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే దాని అర్థం.. విజయానికి మనం చేరువగా ఉన్నామని, వారు దూరంగా ఉన్నారనే. తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడు. మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. 

దేవుడు... పెద్ద స్క్రిప్టు రాశాడు
నా నుదిట మీద వారు చేసిన గాయం కన్నుపై, తలపై తగలలేదంటే దాని అర్థం.. దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్టు రాశాడనే! నా నుదిట మీద వారు చేసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుందేమో గానీ చంద్రబాబు ప్రజలకు చేసిన గాయాలను పేదలు ఎన్నడూ మరిచిపోయే పరిస్థితి ఉండదు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజం. ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం.

మంచి చేయకూడదన్నదే బాబు ఫిలాసఫీ
ఈ కూటమి నాయకుడు చంద్రబాబు 30 ఏళ్ల ఫిలాసఫీని ఒక్కసారి చూస్తే పేద ప్రజలకు ఎలాంటి మంచి చేయకూడదన్నదే ఆయన సిద్ధాంతం. చంద్రబాబు ఎలాంటి వారో ఆయన నైజం చూస్తే అందరికీ తెలుస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దన్నదీ, తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నదీ ఈ బాబే. కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వొద్దని, ఎన్టీఆర్‌ను దింపేసి రూ.5.25కి పెంచేసిందీ, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నదీ ఈ బాబే. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్నదీ, ప్రభుత్వ పాఠశాలలను పాడు పెట్టిందీ ఈ బాబే.

పేదల ఇళ్లకు అడ్డుపడిందెవరు?
పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అడ్డుపడి కులాలు, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందంటూ ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసింది చంద్రబాబు కా­దా? సీఎంగా ఉంటూ బీసీలను, ఎస్సీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు? ఈ బాబే కదా! విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు?.. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అన్నది ఎవరు? ఈ బాబే. ఆ హోదాను తాకట్టు పెట్టిందీ ఈ బాబే. 

మానవత్వం, మంచితనం లేదు..
చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎన్టీఆర్‌ పిల్లనిచ్చి చేరదీస్తే చెప్పులు వేయించి వెన్నుపోటు పొడిచింది బాబు కాదా? మళ్లీ అవసరమైతే ఎన్టీఆర్‌ ఫొటో బయటకు తీసి దండలు వేస్తాడు. ఇంత నీచమైన వ్యక్తి బాబే. ఆ మనిషికి మానవత్వం,  మంచితనం లేదు. దొంగ వాగ్దానాలు, మోసం, కుట్రలు, దోచుకోవడం, దోచుకున్నది  పంచుకోవడం.. ఇదే చంద్రబాబుకు తెలిసిన నీతి.

చేపలకు కొంగను కాపలా పెట్టినట్లే
చంద్రబాబును నమ్మడం అంటే చెరువులో చేపలకు కొంగను కాపలా పెట్డడం లాంటిదే. దొంగ చేతికి తాళాలు ఇవ్వడమే. పులి నోట్లో తల పెట్టడమే. మరి మీ జగన్‌ను చూడండి. ఈ 58 నెలల కాలంలో మీరిచ్చిన అధికారంతో, దేవుడి ఆశీస్సులతో గ్రామగ్రామాన, ఇంటింటా జగన్‌ తెచ్చిన మార్పులు ఏమిటో మీరే చూడండి.

ప్రతి గ్రామంలో ఏడు వ్యవస్థలు..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇవాళ ఏ గ్రామాన్ని తీసుకున్నా ఏకంగా ఏడు వ్యవస్థలు కనిపిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు, మహిళా పోలీసులు, కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు.. ఇలా ప్రతి గ్రామంలోనూ మీ బిడ్డ మార్కు కనిపిస్తోంది. మరి చంద్రబాబు మార్కు ఏమిటి? జన్మభూమి కమిటీలు, పచ్చ పాముల అవినీతి కాట్లు,  లంచాల గాట్లు. అదే మీ బిడ్డ మార్కు చూస్తే అవినీతి, వివక్ష లేకుండా నేరుగా మీ చేతికే అందించే సేవలు కనిపిస్తాయి.

ఈ తేడాను గమనించాలి. పౌర సేవల్లో మనం తెచ్చిన విప్లవాత్మక మార్పులను చూడండి. దేశ చరిత్రలో అవ్వాతాతలకు రూ.3,000 చొప్పున ప్రతి నెలా పెన్షన్‌ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఇంటి వద్దకే రేషన్‌తోపాటు జనన, కుల ధృవీకరణ పత్రాలతో సహా 600 రకాల సేవలు ప్రతి గడపకూ అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో వలంటీర్‌ వ్యవస్థ మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలను గతంలో ఎన్నడైనా చూశారా? కేవలం ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలో కనిపిస్తున్నాయి.

మరి చంద్రబాబు చేసిందేమిటంటే జన్మభూమి కమిటీలను తెచ్చి గ్రామాన్ని, రాష్ట్రాన్ని దోచేశాడు. మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ఇంటింటికి మంచి చేశాడు. రైతన్నకు చెప్పినవి ప్రతీ ఒక్కటీ చేశా. రైతన్నలకు తొలిసారిగా పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నది మీ బిడ్డ పాలనలోనే.

పగటి పూట ఉచిత విద్యుత్, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బీమా, ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్, అమూల్‌తో సహకార రంగాన్ని పటిష్టం చేసింది ఎవరంటే మీ బిడ్డ, మీ జగనే. రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థను తెచ్చిందెవరంటే అది కూడా మీ జగనే. వందేళ్ల తర్వాత 30 లక్షల ఎకరాల భూములను సర్వే చేసి సర్వ హక్కులు కల్పించింది కూడా మీ జగనే.

మనం తెచ్చిన మార్పులు చూసి..
14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా రైతన్నలకు మంచి చేయకపోగా చెడు చేసిన చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఈ 58 నెలల్లో మనం చేసిన పనులు, పథకాలను చూస్తే కడుపు రగిలిపోకుండా ఉంటుందా? విద్యా రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు తెచ్చి విద్యార్థులను, తల్లితండ్రులను ప్రోత్సహించాం.

అమ్మఒడి, విద్యాకానుక, నాడు – నేడు, గోరుముద్ద, డిజిటల్‌ బోధన, ట్యాబ్‌లు, పెద్ద చదువులకు ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌ అమలు చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెనతోపాటు మూడో తరగతి నుంచే టోఫెల్‌ను సైతం ప్రవేశపెట్టాం. మన విద్యార్థులు ఇక్కడ నుంచే ప్రపంచ ప్రఖ్యాత విశ్వ విద్యాలయాల్లో చదువుకునేలా సరికొత్త విధానాలు మీ బిడ్డ పాలనలోనే అమలు జరుగుతున్నాయి.

చదువుల విప్లవంతో బాబుకు కడుపు మంట
మన విద్యారంగంలో ఇన్ని విప్లవాలు కళ్లెదుటే కనిపిస్తుంటే చంద్రబాబుకు కడుపు మండదా? చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే నారాయణ, చైతన్య కోసం బలి పెట్టిన  చదువులు గుర్తుకొస్తాయి. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి. ఇక వైద్య రంగంలో ఆరోగ్యశ్రీని వెయ్యి నుంచి మూడు వేల ప్రొసీజర్లకు విస్తరించడంతో పాటు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. ఆరోగ్య ఆసరాతో ఉపాధి భృతి కూడా మీ బిడ్డ పాలనలోనే అందుతోంది.

మారిన మన గ్రామాలు...
మొట్ట మొదటిసారిగా మన గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, అరోగ్య సురక్ష, నాడు – నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మారాయి. ఏకంగా 54 వేల కొత్త నియామకాలు ప్రభుత్వ వైద్య రంగంలో చేపట్టాం. ప్రభుత్వ రంగంలో మరో 17 కొత్త మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? చేసింది ఎవరు? మీ బిడ్డ పాలనలోనే కదా! మరి చంద్రబాబు కడుపు మండదా? వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్కు ఎక్కడుంది? ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలను వివరించాలి. గతంలో ఏం చెప్పారు? ఆ తరువాత చేసిందేమిటనేది తెలియచెప్పాలి.

బాబు మోసాల చిట్టా ఇదిగో
2014లోకూడా చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి రంగురంగుల హామీలిచ్చారు. దత్త పుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంపించారు. ఆ విఫల హామీల్లో ప్రధానమైనవి ఒక్కసారి పరిశీలిస్తే.. 

► రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు. మరి రూ.14,205 కోట్ల రుణాలలో అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేస్తానని హామీ ఇచ్చి ఒక్కరికైనా చేశాడా? ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు.

ఐదేళ్లలో అంటే 60 నెలల్లో నెలకు రూ.రెండు వేలు చొప్పున ఒక్కో ఇంటికి రూ.1,20,000 ఎవరికైనా ఇచ్చాడా? పక్కా ఇల్లు ఇస్తానన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? రూ.పదివేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ అన్నాడు. చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలు మాఫీ అన్నాడు. ఎక్కడైనా చేశాడా మరి? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? సింగపూర్‌ని మించి అభివృద్ధి చేసి ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుడివాడలో కనిపిస్తోందా? ఇప్పుడు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ కొత్త హామీలతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారు.  

మహిళా సాధికారత..
అక్కచెల్లెమ్మల సాధికారతకు చంద్రబాబు ఓ విలన్‌. వాగ్దానాలతో వంచించడంలో ఆయనకున్న అనుభవం ఇంకెవరికీ లేదు. అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచాడు. అదే మీ బిడ్డ ట్రాక్‌ రికార్డు చూస్తే అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, 30 లక్షల ఇళ్ల పట్టాలు కనిపిస్తాయి. పిల్లల పెద్ద చదువులకు విద్యా దీవెన, వసతి దీవెన అంటే మీ జగన్‌. కల్యాణ మస్తు, షాదీ తోఫాతో అండగా నిలిచి చదువులను ప్రోత్సహిస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాం. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది మీ జగనే. 

మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది
99 శాతం హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నాం. ప్రతి ఇంటికి మంచి చేసి, మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడాలంటూ మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి కళ్లల్లో కళ్లు పెట్టి చూసి నిజాయితీగా ఈ వ్యవస్ధలో మార్పులు తీసుకొచ్చి చెప్పగలుగుతున్నాడు. ప్రజలందరికీ మంచి చేసిన మన జెండా తలెత్తుకుని సగర్వంగా ఎగురుతోంది.

వారి జెండా మరో నాలుగు జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కిందపడుతోంది. మీ ఓటు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు సీఎంగా ఉంటే మన జీవితాల్లో వెలుగులు విరబూస్తాయన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి. ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని స్టార్‌ క్యాంపైనర్లు ఇంటింటికీ వివరించాలి. 

ఏకంగా 2.30 లక్షల ఉద్యోగాలు..
స్వయం ఉపాధితో పేదల జీవితాలు బాగుపడతాయని విశ్వసించి ఎన్నడూలేని విధంగా చేదోడు, వాహన మిత్ర, మత్స్యకార భరోసా లాంటివి తీసుకొచ్చాం. ఇలా ఏది చూసినా మీ జగనే. లా నేస్తం చూసినా గుర్తుకొచ్చేది మీ జగనే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల  ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే ఏకంగా 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఇవాళ నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉద్యోగాల్లో, నామినేటెడ్‌ పోస్టుల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు.

పరిపాలన వికేంద్రీకరణతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. నాలుగు సీ పోర్టుల ఏర్పాటుతోపాటు 10 కొత్త ఫిషింగ్‌ హార్బర్లు, ఎయిర్‌ పోర్టుల విస్తరణ, భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు, మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు, ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టింది మీ జగనే. తొలిసారిగా ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలిచి సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అండగా నిలబడింది మీ జగన్‌. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మనం వరుసగా ఏటా నంబర్‌వన్‌గా నిలిచామంటే కారణం మీ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. 

అందరి అవసరాలు తీర్చారు 
కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే   
 ‘నిన్న జరగాల్సిన సిద్ధం సభ ఒక రోజు ఆలస్యమైనా సీఎం జగన్‌ను దీవించేందుకు మీరంతా ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం ఆనందంగా ఉంది. ఐదేళ్ల పాలనలో స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి అవ్వాతాతల వరకు ప్రతి ఒక్కరి అవసరాలను జగనన్న ప్రభుత్వం తీర్చింది. దళారులకు తావులేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసింది.

ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది నిరుపేదల ప్రాణాలను వైఎస్సార్‌ కాపాడితే సీఎం జగన్‌ ఆ దారిలో మరో నాలుగు అడుగులు ముందుకేసి సంపూర్ణ వైద్య భరోసా కల్పిస్తున్నారు. గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే ఎంతోమంది అనారోగ్య బాధితులు ఒక్కసారి సీఎం జగన్‌కు కలిస్తే ఎంత ఖర్చయినా పరిష్కారం లభిస్తుందన్న భరోసాతో కనిపించారు. ఒక వ్యక్తిపై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకం ఇదీ.

వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు మాయా కూటమి కట్టాడు. ఆయన వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ను పక్కన పెట్టుకున్నాడు. వీళ్లందర్నీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా వైఎస్‌ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కుట్రలకు తెగించారు.

భౌతికంగా తొలగించాలనే కుట్రతో శనివారం రాత్రి విజయవాడలో సీఎంపై దాడికి పురిగొల్పారు. వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ చెబుతున్నట్లుగానే ఆ దేవుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే నుదిటి మీద బలమైన దెబ్బ తగిలినా కాపాడాడు. ప్రజల ఆశీస్సులతో 50 రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రి పదవి కచ్చితంగా చేపడతారు.

సీఎం జగన్‌ చెప్పిన మాటపై నిలబడతారు. ఓట్లు కోసం, పదవుల కోసం ఆయనతో ఒక్క చిన్న అబద్ధం కూడా చెప్పించలేం. ఐదేళ్లుగా ఆయన్ను చాలా దగ్గర నుంచి చూశాం. జగన్‌ కథ తేలుస్తానంటున్న చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు. ఈ జన్మలో ఆయనకు అది సాధ్యం కాదు. ప్రజలంతా అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుపై వేసి గెలిపించాలి.   

పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు 
తన మీద ఒక రాయి విసిరినంత మాత్రాన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరంటూ సీఎం జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. తన సంకల్పం చెక్కు చెదరదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన గాయాలను పేదలు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. ‘మీ బిడ్డ వైఎస్‌ జగన్‌ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కుచెదరదు.

వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే విజయానికి మనం అత్యంత చేరువగా.. వాళ్లు చాలా దూరంగా ఉన్నారని అర్థం’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ‘నా నుదిటి మీద వాళ్లు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో గానీ.. పేదలకు చంద్రబాబు చేసిన గాయాలను వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. గాయపర్చడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం చంద్రబాబు నైజమైతే.. మీ ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పడానికి గర్వపడుతున్నా’ అంటూ సీఎం జగన్‌ మరో ట్వీట్‌ చేశారు. 
–సాక్షి, అమరావతి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement