మంచి చేయడమే.. మాట తప్పకపోవడమే.. 'మన కల్చర్‌': సీఎం జగన్‌ | CM YS Jaganmohan Reddy at Pulivendula public meeting | Sakshi
Sakshi News home page

మంచి చేయడమే.. మాట తప్పకపోవడమే.. 'మన కల్చర్‌': సీఎం జగన్‌

Published Fri, Apr 26 2024 6:07 AM | Last Updated on Sat, Apr 27 2024 12:17 AM

CM YS Jaganmohan Reddy at Pulivendula public meeting

పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తెలుగు నేలపై నమ్మకాన్ని అణువణువునా నింపింది పులివెందుల బిడ్డలే 

పులివెందులంటే ఓ నమ్మకం, అభివృద్ధి, సక్సెస్‌ స్టోరీ 

టీడీపీ మాఫియా దుర్మార్గాలను ఎదిరించే ధైర్యాన్నిచ్చింది 

ప్రతి కష్టంలోనూ నా వెంట నడిచింది 

మీ బిడ్డను ఎదుర్కోలేక బాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఎల్లోమీడియా ఏకమయ్యారు.. వారి కుట్రలో నా ఇద్దరు చెల్లెళ్లూ భాగస్వాములయ్యారు  

వైఎస్సార్‌ లెగసీ లేకుండా చేయాలని చూసిన పార్టీలో చేరారు.. వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపి మోకరిల్లిన వీళ్లా వైఎస్సార్‌ వారసులు? 

మహానేతకు వారసులు ఎవరనేది ప్రజలే చెప్పాలి

పథకాలు, ప్రజలకు మంచి చేయడంలో మీ జగన్‌ను ఎవరూ కొట్టలేరు  

పులివెందుల కల్చర్‌.. కడప కల్చర్‌.. రాయలసీమ కల్చర్‌.. అంటూ మనపై వేలెత్తి చూపించే కార్యక్రమం నిత్యం జరుగుతోంది. యస్‌.. మన కల్చర్‌ మంచి చేయటం.. మన కల్చర్‌ మంచి మనసు..మన కల్చర్‌ మాట తప్పకపోవటం.. మన కల్చర్‌ బెదిరింపులకు లొంగకపోవడం.. అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. 

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం వైఎస్‌ జగన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. 

నమ్మకం.. ధైర్యం.. అభివృద్ధి.. సక్సెస్‌ స్టోరీ
పులివెందుల అంటే నమ్మకం. పులివెందుల అంటే ధైర్యం. పులివెందుల అంటే అభివృద్ధి. పులివెందుల అంటే ఒక సక్సెస్‌ స్టోరీ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయగాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందులలో కనిపిస్తూ అభివృద్ధి బాటలో పరిగెత్తుతోందంటే ఈ అభివృద్ధి, ఆ మార్పులకు మూలం నా తండ్రి, మనందరి ప్రియ­తమ నాయకుడు  దివంగత వైఎస్సార్‌ అయితే.. ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్‌ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని సవినయంగా తెలియ­జే­స్తున్నా. పులివెందులలో ఏముంది? అని ఒకప్పుడు అడిగిన పరిస్థితుల నుంచి పులివెందు­ల­లో ఏం లేదో చెప్పాలని అడిగే స్థాయికి మన పట్టణాన్ని,  నియోజకవర్గాన్ని మార్చుకుంటూ అడుగులు వేశాం. రాబోయే రోజుల్లో కూడా వేస్తాం.

నమ్మకాన్ని నింపింది పులివెందుల బిడ్డలే
ఒక్కటి గమనించండి. మనందరి పులివెందుల మనకే కాదు... రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ప్రసాదించింది. మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని, మోసం చేయడన్న విశ్వాసాన్ని తెలుగు నేలపై అణువ­ణువునా నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని సగర్వంగా, సవినయంగా తెలియజే­స్తున్నా.

కాబట్టే ఆ చంద్రబాబుకు, ఈనాడుకు, ఆంధ్ర­­జ్యోతికి, టీవీ, ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదమేమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్‌ అంటూ మనమీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తుంటారు. పులివెందులను తెలుగుసీమ అభిమానించింది. నమ్మింది, కలిసి నడిచింది. పులివెందుల, కడప, రాయలసీమ మంచితనం, మాటపై నిలబడే గుండెధైర్యం రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికీ అర్థమైంది కాబట్టే ఓ వైఎస్సార్, ఓ జగన్‌ను మారుమూల ప్రాంతాల్లో కూడా అభిమానించే కోట్ల మంది ఈరోజు కనిపిస్తున్నారు.

కొత్తగా వైఎస్సార్‌ వారసులం అంటూ..
వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ­తీయటానికి చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి,  టీవీ 5, దత్తపుత్రుడు, ఓ వదినమ్మ ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చూస్తున్నారు. వీరికి తోడు, వారి కుట్రలో భాగంగా ఈ మధ్య కొత్తగా వైఎస్సార్‌ వారసులం.. అంటూ మీ ముందుకు వస్తున్నారు. నేను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగు­తున్నా. ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పా­ల్సింది ప్రజలు, వైఎస్సార్‌ను ప్రేమించేవారు కాదా? ఒక్క విషయం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.

ఆ దివంగత మహానేత, నాన్నగారి మీద కక్షపూ­రితంగా, కుట్రపూరితంగా, ఆయన చనిపో­యిన తర్వాత కూడా కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సీబీఐ చార్జిషీట్‌లో పెట్టింది ఎవరు? ఒక వైఎస్సార్‌ లెగసీని లేకుండా చేయాలని చూస్తున్నది ఎవరు? వైఎస్సార్‌ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు లేకుండా చూడా­లని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ పులివెందుల ప్రజలకు, వైఎస్సార్‌ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. 

వైఎస్సార్‌ పోరాడిన వారితో కుమ్మక్కు!
రాజకీయంగా అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితోనే కలిసిపోయి.. కాంగ్రెస్, టీడీపీతో చేయి కలిపి, వైఎస్‌ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్లందరితోనూ కలిసిపోయి, ఆ కుట్రలను అమలు చేస్తున్న శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా... వైఎస్సార్‌ వారసులు?  వైఎస్సార్‌గారు బతికున్నంతకాలం ఎవరితో పోరాటం చేశారు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయ­మని కోరుతున్నా. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ను అభిమానించే అభిమానులు, కార్య­కర్తలు ఎవరితో యుద్ధం చేశారు? అని ఆలోచన చేయమని కోరుతున్నా. 

కుట్రలో భాగస్వాములు వారసులా?
వైఎస్సార్‌ మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకుని వెళ్లి, వారికి మోకరిల్లి, వారి స్క్రిప్టులను మక్కీకి మక్కీ చదివి వినిపిస్తూ, వారి కుట్రల్లో భాగమవుతున్న వీళ్లా వైఎస్సార్‌ వారసులు? వైఎస్సార్‌ కీర్తి ప్రతి­ష్టలను, ఏకంగా ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపివేయాలని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే ఉండకూడదని, వైఎస్సార్‌ విగ్రహాలు ఏ గ్రామంలోనూ  ఉండకూడదని, ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెక్కలు చేస్తామని బహిరంగంగానే చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్సార్‌ వారసులు? ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్సార్‌ లెగసీకి ఓటు వేసినట్లా? లేక వైఎస్సార్‌ పేరు కనపడకుండా చేసే కుట్రలకు ఓటు వేసినట్టా? రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతున్నా.

వారి వెనుక ఎవరున్నారో కనిపిస్తూనే ఉంది
ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డ ఒక్కడి మీద ఇంత మంది కలిసి ఏకమవుతున్నారు. రాజకీ­యాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతున్నా. ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో కూడా మీ అందరికి కనిపిస్తూనే ఉంది.

ఆశ్చర్యం ఏమిటంటే.. వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి.. ఔను నేనే చంపా­నని అతి హేయంగా, బహిరంగంగా చెప్పుకుంటూ తిరు­గుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో మీరే చూస్తున్నారు కదా! నాడు చిన్నాన్నను అన్యా­యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారి­తో, సంఖ్యా­­బలం లేకపోయినా కూడా ప్రలో­భాలు, అధికార బలంతో ఓడించిన వారితో ఈరోజు చెట్టా­పట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటే దానికి అర్థమేమిటి? చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవమా? కాదా? ఆ రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా? కాదా? ఆనాడు ఎవరు ఫోన్‌ చేస్తే అవినాష్‌ అక్కడికి వెళ్లాడు? అవినాష్‌ పలు ఇంటర్వ్యూలు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లలో అడిగిన ప్రశ్నలు సహేతుకమే కదా! ఎవరైనా అవినాష్‌ వైపు మాట్లాడితే చాలు వెంటనే వారిపై కూడా అడ్డగోలు ఆరోపణలతో కుట్ర రాజకీయాలు చేయడం ధర్మమేనా? చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా?

కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబు, బీజేపీకి లాభం
అసలు కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లెన్ని వచ్చాయి? నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన ఆ కాంగ్రెస్‌ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్‌ పార్టీలో చేరి వైఎస్సార్‌ గారి పేరును, ఆయన చనిపోయిన తర్వాత కూడా చార్జ్‌ షీట్‌లో చేర్చిన ఆ కాంగ్రెస్‌ పార్టీలో చేరి మొత్తంగా వైఎస్సార్‌ పేరునే తుడిచి వేయాలని, కనపడకుండా చేయాలని ప్రయత్ని­స్తున్న వారికి ఓటు వేయటం అంటే దానివల్ల ఎవరికి లాభమో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా.

అలాంటి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా? ఇదంతా మన ఓట్లను విడగొట్టి వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కాదా? అసలు ఎవరికి వైఎస్సార్‌ గారి మీద ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలి. పులివెందుల, కడప గడ్డపై ఎవరికి ప్రేమ ఉందో ఆలోచన చేయండి. వైఎస్సార్, పులివెందుల, వైఎస్సార్‌ జిల్లా పేర్లు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ఆలోచన చేయండి. మరోపక్క ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడుతున్న ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు కుట్రలు చేస్తున్నారో గమనించమని కోరుతున్నా. 

పేదలకు మంచి చేసేందుకే అధికారం
పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నామీద ఆరోపణలు చేస్తున్న నా బంధు­వులకు ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదల్చు­కున్నా. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడంటున్న నా బంధువులకు తెలియజే­స్తున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరు­లను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు. మరొక్క విషయం కూడా నిండు­మనసుతో చెబుతున్నా.

వైఎస్‌ అవినాశ్‌ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే టికెట్‌ ఇచ్చా. అవినాశ్‌ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా అవినాశ్‌ను దూషించడం, అతడిని తెరమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. మా అందరికన్నా అవినాష్‌ చాలా చిన్నోడు. అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని ఇంత పెద్ద పెద్ద వాళ్లందరూ కూడా కుట్రల్లో భాగం అవుతున్నారంటే నిజంగా వీళ్లందరూ మనుషులేనా?  

మన పాలనలో మనసు, మానవత్వం..
ఈరోజు పులివెందులలోగానీ, కడపలోగానీ మొత్తం తెలుగు నేలమీద గానీ ఒక జలయజ్ఞం, ఉచిత విద్యుత్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ.. వీటన్నింటితోపాటు మీ జగన్‌ తెచ్చిన అమ్మ ఒడి, ఇంగ్లిష్‌ మీడియం, నాడు–నేడు, చేయూత, వైఎస్సార్‌ ఆసరా, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మా­ణాలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ,, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, విలేజ్‌ క్లినిక్, రైతు భరోసా, ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థలు, డీబీటీతో బటన్‌ నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయడం.. ఇవన్నీ మన మనసు, మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా? 

నాన్న మరణం తర్వాత పట్టించుకున్నారా?
నాన్నగారి మరణం తర్వాత పదేళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా, ఎవరైనా మన పులివెందులను పట్టించుకున్నారా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. మళ్లీ పులివెందుల దశ మారింది ఎప్పుడంటే? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, ఈ 58 నెలల్లోనే కాదా? పులివెందులను, వైఎస్సార్‌ జిల్లాను ఇంకా అభివృద్ధి చేయా­లి. వచ్చే ఐదేళ్లలో మీ అందరి అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా మన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.

పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్సార్, వైఎస్‌ జగన్‌.. ఇవన్నీ మనసున్న పేర్లు కాదా? ఈ పేర్లను చెరిపివే­యాలనుకునే వారు ఎన్నటికీ మనకు, ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులేనని గమనించాలని కోరుతున్నా. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో ఐదేళ్లు మన పులివెందుల అభివృద్ధి ప్రయాణానికి, మీ జగన్‌ ప్రయాణానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. మీ బిడ్డకు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. అవినాశ్‌ను కూడా అంతే ఆప్యాయతతో, గొప్ప మెజార్టీతో దీవించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నా. 

► ఈ కార్యక్రమంలోఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మంచి చేయడంలో మీ జగన్‌ను కొట్టలేరు!
జగన్‌ను పథకాలలో కొట్టలేరు. పాలనలో, పనితీరులో జగన్‌ను కొట్టలేరు. పల్లెకు మంచి చేయడంలో జగన్‌ను కొట్టలేరు. జగన్‌ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు. జగన్‌ను రైతులకు అందించిన రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల్లో కొట్టలేరు. జగన్‌ను అక్కచెల్లెమ్మలకు చేసిన మంచిలో, మేలులో కొట్టలేరు. జగన్‌ను అవ్వాతాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు.

వారి ఆత్మగౌరవం కాపాడటంలో కూడా జగన్‌ను కొట్టలేరు. జగన్‌ను డీబీటీలో అంటే బటన్లు నొక్కడంలో కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్‌ మంచి చేయలేదు అని వీళ్లు చెప్పలేరు. తమ 14 ఏళ్ల పాలనలో జగన్‌ కంటే మంచి చేశాం అని వాళ్లు చెప్పలేరు. అందుకే ఆలోచన చేయమని అడుగుతున్నా. మన బ్రాండ్‌ జగన్, మన బ్రాండ్‌ వైఎస్సార్, మన బ్రాండ్‌ కడప, మన బ్రాండ్‌ పులివెందులను కొట్టాలనుకుంటున్న వీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? 

సీఎం జగన్‌ నామినేషన్‌ దాఖలు
పులివెందుల: ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఉదయం సీఎస్‌ఐ చర్చి మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం 11.10 గంటలకు అంబకపల్లె రోడ్డు మినీ సెక్రటేరియట్‌లో ఉన్న ఆర్‌వో కార్యాలయానికి సీఎం రోడ్డు మార్గాన చేరుకున్నారు. 11.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ తన నామినేషన్‌ పత్రాలను ఆర్‌వో వెంకటేశులుకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్‌ వెంట ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి,  వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిన్నప్ప ఉన్నారు.

అనంతరం సీఎం జగన్‌ భాకరాపురంలోని స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కాసేపు గడిపారు.  నామినేషన్‌ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కడప బయలుదేరి వెళ్లారు. హెలిప్యాడ్‌ వద్ద పులివెందుల మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రుక్మిణి, కౌన్సిలర్‌ శైలజ, పలువురు మహిళలు గుమ్మడికాయతో ముఖ్యమంత్రికి దిష్టి తీశారు. కాగా, సీఎం జగన్‌ తరఫున పులివెందులలో వైఎస్‌ మనోహర్‌రెడ్డి గత సోమవారం ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.  

నా ప్రాణానికి ప్రాణం.. నా పులివెందుల పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. నన్ను నిరంతరం ప్రేమిస్తూ ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే పులివెందుల అన్నద­మ్ములకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ జగన్‌ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. పులివెందుల అభివృద్ధికి మూలం వైఎస్సార్‌.

పులివెందులను ఆదర్శంగా తీర్చిదిద్దాం
పులివెందుల అభివృద్ధికి గత ఐదేళ్లలో తీసు­కున్న చర్యలను క్లుప్తంగా వివరిస్తా. పులి­వెందుల ప్రజల చిరకాల కోరిక.. ఆ కనిపి­స్తున్న మెడికల్‌ కాలేజీ. నాన్న కలలుగన్న ఆ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిని ఈమధ్యనే పులివెందుల ప్రజలకు అంకితం చేశాం. ఈ జూలై, ఆగస్టులో మెడికల్‌ కాలేజీని కూడా అంకితం చేయబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నామో మీ అందరికీ కనిపి­స్తూనే ఉంది. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌­ఎస్‌ఎస్‌ అనుసంధానంలో భాగంగా రూ.900 కోట్లతో కాలేటివాగు సామర్థ్యాన్ని 1.02 టీఎంసీలకు  పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో గతంలో మూడు, నాలుగు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితిని మారుస్తూ ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం దాదాపు రూ.250 కోట్లు చెల్లించాం. 2020 నుంచి క్రమంతప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని ఏటా నింపుతూ వస్తున్నాం. పైడిపాలెం రిజర్వాయర్‌ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు తీసుకు­న్నాం.

యురేనియం బాధిత గ్రామా­లతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండ­లాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఏకంగా రూ.1,000 కోట్లతో ఎరబ్రల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనులు వేగంగా జరగడం మన కళ్లెదుటే కనిపిస్తోంది. వాటర్‌ గ్రిడ్‌ ద్వారా రూ.480 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ తాగునీటి సరఫరా దాదాపుగా పూర్తయింది. పులివెందులలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ క్యాంపస్‌ను ప్రారంభించాం. ఏపీ కార్ల్‌లో న్యూటెక్‌ సైన్సె­స్‌ పరిశ్రమతోపాటు వైఎస్సార్‌ వ్యవ­సా­­య కళాశాల, ఉద్యాన కళాశాల­లను నెల­కొల్పాం. ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ పరిశ్ర­మ­ను పులివెందులకు తెచ్చాం. కేంద్రంతో పలుదఫాలు చర్చించి హైవేలు, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్రాజెక్టులు సాధించాం. 

ఇవన్నీ మీ బిడ్డ సీఎం కాబట్టే కదా..
పులివెందులలో కొత్త బస్టాండ్, క్రికెట్‌ స్టేడియం, పార్కులు లాంటివి మీరంతా చూస్తు­న్నారు. మొత్తంగా దాదాపు రూ.5,900 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరగడం కళ్లెదుటే కనిపి­స్తోంది. ఇవన్నీ కాకుండా మీ బిడ్డ బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతా­ల్లోకి పంపించిన సొమ్ము మరో రూ.2,069 కోట్లు ఉంటుందని చెప్పడానికి గర్వపడు­తున్నా. మన పులివెందులలో నవరత్నాలు  పథకాల ద్వారా 94.4 శాతం గడపలకు లబ్ధి చేకూరింది. చీనీ అమ్మకాలకు అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా పులివెందులలోనే విక్రయించే ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ చేశామంటే కారణం మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. 
– సాక్షి ప్రతినిధి, కడప

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement