దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలర్పించింది
కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి నామినేషన్ ర్యాలీలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఎంపీ రేణుక
ఖమ్మం వన్‌టౌన్: మతతత్వ, ఫాసిస్ట్ శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా, రాహుల్ ప్రధాని పదవిని సైతం వదులుకున్నారన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రఘురాంరెడ్డి కుటుంబం ప్రజలందరికీ తెలుసునని, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాకే అధినాయకత్వం ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత పోతినేని మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకుని మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని కూనంనేని వెల్లడించగా, భువనగిరి తప్ప మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందని సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనది ఖమ్మం జిల్లానేనని.. ప్రజలు, ప్రభుత్వ అవసరాల కోసం ఏళ్ల క్రితమే తమ భూములు ఇచ్చామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment