MLA Dwarampudi Chandrasekhara Reddy Strong Counter To Pawan Kalyan Remarks - Sakshi
Sakshi News home page

నీకన్నా గట్టిగానే విమర్శించగలను.. వాళ్లను నట్టేట ముంచావ్‌: పవన్‌పై ద్వారంపూడి ఫైర్‌

Published Mon, Jun 19 2023 11:18 AM | Last Updated on Mon, Jun 19 2023 1:29 PM

Dwarampudi Chandrasekhara Reddy Strong Counter To Pawan - Sakshi

సాక్షి, కాకినాడ: వారాహి యాత్రలో జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ తనపై చేసిన తీవ్ర విమర్శలకు కాకినాడ అర్బన్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన..  పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి అని ఏకిపాడేశారు. పార్టీ పెట్టినవాళ్లు ఎవరైనా ఇప్పుడు నీతో ఉన్నారా? అని పవన్‌ను నిలదీశారాయన. 

పవన్‌ నాపై చేసిన అసత్య ఆరోపణలు నిరూపించాలి. నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. మేం రౌడీలమైతే మమ్మల్ని జనం ఎందుకు గెలిపిస్తారు?.  నువ్వు రెండు చోట్ల ఓడిపోయావ్‌. నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు. నన్ను ఓడించడం నీ వల్ల కాదు అని మండిపడ్డారాయన. జనసేనను ఎవరిని ఉద్దరించేందుకు పెట్టావ్‌ అంటూ పవన్‌ను నిలదీశారాయన. పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి అని, చంద్రబాబుతో బేరం కుదరకే రోడ్డుపైకి వచ్చాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. రాజకీయాల్లో సీఎం కావడం పవన్‌కు సాధ్యం కాదని తేల్చేసిన ద్వారంపూడి.. కావాలనుకుంటే అది సినిమాల్లోనే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు.

పవన్‌.. నోరు అదుపులో పెట్టుకో
ప్యాకేజీలు, సీట్ల ఒప్పందం కుదరకుంటే పవన్‌ రోడ్డు మీదకు వస్తాడు. ఎవడో చెప్పిన మాటలు విని కోతి గంతులేయకు.  తల్చుకుంటే కాకినాడలో పవన్‌ బ్యానర్‌లే ఉండేవి కావు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.

👊 పవన్‌ రాజకీయపరంగా జీరో. ఎమ్మెల్యే కావాలన్నా.. సీఎం కావాలన్నా అది సినిమాల్లోనే పవన్‌కు సాధ్యమయ్యేది.  చంద్రబాబును ఉద్దరించడానికే పార్టీని నడిపిస్తున్నాడు. ప్యాకేజీ కుదరకే వారాహి ఎక్కి తిరుగుతున్నాడు. కాకినాడలో అన్ని సామాజిక వర్గాలు కలిసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాయి. 

👊 చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును, పవన్‌ను తరిమేస్తే అసలు కులాల గొడవే ఉండదు. కులాల గురించి మాట్లాడను అంటూనే కులాల మధ్య పవన్‌ చిచ్చు పెట్టేలా ప్రసంగిస్తు‍న్నాడు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కానున్నాయి.  

👊 నీ కన్నా పెద్ద నాలిక నాది.. నీకన్నా గట్టిగానే విమర్శించగలను. నువ్వు మాటల్లో చూపిస్తే.. నేను చేతల్లో చూపించగలను. కబ్జా కోరును, రౌడీని అయితే జనం నన్ను గెలిపిస్తారా?. నేను సీఎం కాలేనని మూడు నెలల కిందట ఓసారి అన్నావ్‌. ఇప్పుడే సీఎం చేయండని అడుగుతున్నావ్‌. నాది డీ బ్యాచ్‌ అయితే నీది ఏ బ్యాచ్‌?. నా దగ్గర 15వేల కోట్లు ఉంటే ముందు నిన్నే కొనేస్తా.  

👊 కాకినాడ పోర్టులో తక్కువ ఛార్జీలు ఉండడం వల్లే బియ్యం ఎగుమతులు. వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని పవన్‌కు ద్వారంపూడి హితవు పలికారు. 

👊 పార్టీ పెట్టినవాళ్లు ఎవరైనా ఇప్పుడు నీతో ఉన్నారా?. నన్ను నమ్మి వచ్చినవాళ్లు ఇప్పుడు నా వెంటే ఉన్నారు అని ద్వారంపూడి తెలిపారు.

రంగాను చంపిన వ్యక్తితో దోస్తీనా?
👊 వంగవీటి రంగా నాకు ఆదర్శం. రంగాను చంపిన చంద్రబాబు కోసం పవన్‌ పని చేస్తున్నాడు. రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగానే చంద్రబాబుతో పవన్‌ చేతులు కలిపాడు. చంద్రబాబు హామీ ఇవ్వకపోతే నీ పార్టీ నేతలకు ఎక్కడ టికెట​ ఇస్తావో చెప్పలేని స్థితి నీది అని పవన్‌కు చురకలు అంటించారు ద్వారంపూడి. 

పవన్‌కు ద్వారంపూడి సవాల్‌
ఈరోజు నుంచి నీ పతనం ప్రారంభమైంది అని పవన్‌పై తీవ్రస్థాయిలో ద్వారంపూడి ధ్వజమెత్తారు. నన్ను ఓడిస్తానని పవన్‌ విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తానని ద్వారంపూడి తెలిపారు. ‘‘నువ్వు జనసేన అధినేతవే అయితే.. నాపై పోటీ చేయు. నిన్ను తుక్కుతుక్కుగా ఓడించకపోతే నా పేరు చంద్రశేఖరే కాదు.  నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు ఓడిపోయానా అదే పని చేయాలి అని పవన్‌కు ప్రతిసవాల్‌ విసిరారు ఎమ్మెల్యే  ద్వారంపూడి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement