కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష!.. ‘ఆడపిల్లను.. పోరాడగలను అంటూ’ | UP elections 2022: High priority for Women in Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష!.. ‘ఆడపిల్లను.. పోరాడగలను అంటూ’

Published Thu, Jan 27 2022 8:11 AM | Last Updated on Sat, Jan 29 2022 6:05 PM

UP elections 2022: High priority for Women in Congress Party - Sakshi

‘ఆడపిల్లను..పోరాడగలను’ అనే నినాదాన్ని ముందుపెట్టి ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను పెద్ద సంఖ్యలో నిలబెడుతుండటం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి అగ్నిపరీక్ష పెట్టనుంది. మూడు దశాబ్దాలుగా యూపీ అధికార పీఠానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ వ్యూహం ఎంతమేరకు కలిసొస్తుందన్నది అనుమానంగానే ఉంది. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు పెద్ద సంఖ్యలో మహిళా అభ్యర్థులను పోటీలో నిలిపినా 19 శాతానికి మించి మహిళలు గెలుపు తీరాలను చేరకపోవడం, లోక్‌సభ ఫలితాలు ఇందుకు భిన్నంగా లేకపోవడం కాంగ్రెస్‌ ఎత్తుకున్న ఎజెండాపై ప్రశ్నలు లేవదీస్తున్నాయి. 

కలిసిరాని కాలం... 
గడిచిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో మహిళా ప్రాతినిధ్యం అంతంతగానే ఉంది. 6.98కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నప్పటికీ గడిచిన నాలుగు అసెంబ్లీల్లో వీరి సంఖ్య మాత్రం పెద్దగా లేదు. 2002లో అన్ని పార్టీల తరఫున మహిళా అభ్యర్థుల సంఖ్య 184 మంది పోటీలో నిలవగా, కేవలం 31మంది మాత్రమే మహిళా అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2007 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి 154 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా కేవలం 25 మాత్రమే గెలువగా. 2012 నాటికి 224 మంది అభ్యర్థుల్లో 43 మంది గెలిచారు. ఇందులో ఎస్పీ తరఫున 21 మంది, బీజేపీ తరఫున 8మంది గెలిచిన వారిలో ఉన్నారు. ఇక గడిచిన 2017 ఎన్నికల్లో 151మంది మహిళా ఎమ్మెల్యేల్లో 42 మంది గెలిచినట్లు గణాంకాలు చెబుతుండగా, ఇందులో బీజేపీ తరఫున 36 మంది గెలిచారు.

చదవండి: (Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..!)

నాలుగు ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం సగటున 19శాతానికి పరిమితం అయింది. ఇందులోనూ గడిచిన రెండు దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ తరఫున గెలిచిన మహిళా అభ్యర్థులు పది సంఖ్యను దాటలేదు. ఇక 1999 నుంచి జరిగిన నాలుగు లోక్‌సభ ఎన్నికల్లోనూ యూపీలో అన్ని పార్టీల తరఫున 153 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసినా ఇందులోనూ 45 మంది మాత్రమే గెలువగా, దీని శాతం 29.41శాతానికి దాటలేదు. ఒక్క 2017లో మినహా మహిళా అభ్యర్థులను అధికంగా పోటీలో నిలిపిన ఏ పార్టీకి అధిక స్థానాలు దక్కలేదు. 2017లో మాత్రం అధికార బీజేపీ 42మందిని పోటీలో నిలబెడితే 36మంది గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ 40శాతం మంది మహిళలకు సీట్లు కేటాయించడం పార్టీకి పెద్ద పరీక్షనే పెడుతోంది. 

చదవండి: (సిద్దూపై సుఖ్‌బీర్‌ బావ పోటీ)

టిక్కెట్లు కాదు.. హామీల్లోనే కాంగ్రెస్‌ దూకుడు... 
కాంగ్రెస్‌ పార్టీ ముందు నుంచీ చెబుతున్న మాదిరి యూపీలో మహిళలకు 40శాతం టికెట్లు కేటాయించేలా కార్యాచరణ తీసుకుంది. ఇప్పటికే తొలి విడతలో 145 మంది అభ్యర్థులను ప్రకటించగా, అందులో 50  మంది అభ్యర్థులు మహిళలు ఉండగా, రెండో జాబితాలో 41మంది పేర్లలో 16 మంది మహిళల పేర్లున్నాయి. కనీసంగా 140–150  మంది మహిళలకు పార్టీ టిక్కెట్లు కేటాయించేలా ప్రియాంక ప్రణాళికలున్నాయి.

కాంగ్రెస్‌ ప్రకటించిన జాబితాలో ప్రముఖ సినీ నీటి అర్చనా గౌతమ్‌(హస్తినాపూర్‌), ఉన్నావ్‌ బాధితురాలి తల్లి ఆశాసింగ్‌ (ఉన్నావ్‌), ఆశావర్కర్‌ పూనమ్‌ పాండే(షాజహాన్‌పూర్‌), లఖీమ్‌పూరి ఖేటీ ఘటనలో పోలీసు బాధితురాలు రీతాసింగ్‌(మొహమ్మదీ), మాజీ మేయర్‌ సుప్రియా అరోన్‌ (బరేలీ), జర్నలిస్టు నిదా అహ్మద్‌ (సంభాల్‌) వంటి ప్రముఖులను పోటీలో నిలిపింది. టికెట్లతో పాటే హామీల విషయంలోనూ ప్రియాంక తన మార్కును చూపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం రిజర్వేషన్లు, 25 శాతం పోలీసు పోస్టులు, 50 శాతం పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (పీడీఎస్‌) దుకాణాలు, ఫోన్లు, స్కూటర్లు వంటి హామీలను గుప్పించారు. గత పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రియాంకకు నారీశక్తి ఎంతగా మేలు చేస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. 
– సాక్షి, న్యూఢిల్లీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement