కేంద్ర మంత్రిత్వ పదవి, సినిమాల్లో నటించడంపై నటుడు సురేషి గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీ కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేషి గోపి.. ఇటు సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ వార్తలపై సురేష్ గోపి స్పందించారు. మంత్రి పదవిలో ఉంటూ సినిమాల్లో నటించినందుకు తనను కేంద్ర సహాయ మంత్రిగా తొలగిస్తే.. తనను తాను రక్షించుకున్నట్లేనని పేర్కొన్నారు. అదే విధంగా తన తదుపరి చిత్రం 'ఒట్టకొంబన్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరానని.. ఇంకా దీనిపై ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అయితే సెప్టెంబర్ 6న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
కాగా సురేషి గోపి ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్‌లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి ఉన్నారు. అటు సినిమాల్లోనూ నటన కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రస్తుతం తన వద్ద అనేక స్క్రిప్ట్‌లు ఉన్నాయని, వీటిలో 20 నుంచి 22 సినిమాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అనుమతి కోరగా.. ఆయన ఎన్ని సినిమాల్లో నటించాలని అడిగారని చెప్పారు.
@నేను 22 సినిమాల్లో నటించాల్సి ఉందని అమిత్ షాకు చెప్పాను. అయితే దీనిని ఆయన పక్కన పెట్టారు. ప్రస్తుతం సినిమాల్లోకి నటించేందుకు అనుమతి ఇస్తానని చెప్పారు. ఇప్పుడైతే సెప్టెంబర్ 6 నుంచి షూటింగ్‌లో పాల్గొంటాను’ అని కేరళలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
‘మంత్రి పదవిని నిర్వహించేందుకు సహకరించడానికి మంత్రివర్గానికి చెందిన ముగ్గురు, నలుగురు అధికారులను నా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సినిమా సెట్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇదంతా వీలు కాకపోతే.. వారు నన్ను కేంద్ర పదవి నుంచి తీసివేస్తే, అది నాకు మేలు చేసిన వాడిగా భావిస్తాను.
నేను మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ ఆ కోరిక లేదు. నా కోసం కాకుండా నన్ను ఎన్నుకున్న త్రిసూర్ ప్రజల కోసం నాకు మంత్రి పదవి ఇస్తున్నామంటూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నేను తలవంచి అంగీకరించాను. ఇప్పటికీ నేను మా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. కానీ నా అభిరుచి (సినిమా) లేకుండా ఉండలేను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment