
సాక్షి, విశాఖపట్నం: జససేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ చేసేది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో టీడీపీ దద్దమ్మలు చంద్రబాబు మాటలు విని పోలీసులపై దాడులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పప్పు నారా లోకేశ్‌ను సీఎం చేయడమే పవన్ లక్ష్యమని పాల్ చెప్పుకొచ్చారు.
కాగా, కేఏ పాల్ శనివారం పప్పు లోకేశ్‌కే మన ఓటు అంటూ ఫ్లెక్సీ పెట్టి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ విశాఖలో నారాహి యాత్రను ఉపసంహరించుకోవాలి. పవన్ చూసి ప్రధాని మోదీ మొహం చాటేశారు. పవన్ మీద ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉన్నాయా?. విభజన హామీల కోసం పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. దశావతారంలాగా పవన్ కల్యాణ్ పది పార్టీలు మార్చారు. జనసేన పార్టీని పవన్.. ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. ప్రజాశాంతి పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటిస్తాను.
పవన్ వారాహి యాత్రకు వెళ్లే రూ.500 ఇస్తున్నారు. చంద్రబాబు యాత్రకు వెళ్లే రూ.1000 ఇస్తున్నారు. పవన్ పెద్ద సినిమా స్టార్ అయినా ఆయన సభలకు జనాలు రావడం లేదు. నారా లోకేశ్(పప్పు)ను సీఎంను చేయడమే పవన్ లక్ష్యం. చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అమరావతిలో వేల కోట్ల దోపిడీ చేశారు. టీడీపీ దద్దమ్మలు చంద్రబాబు మాటలు విని పోలీసులపైనే దాడులు చేస్తున్నారు. పోలీసులపై టీడీపీ నేతల దాడులకు తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ సీరియస్ అయ్యారు. ఇక, కేఏ పాల్ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాల్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు.
ఇది కూడా చదవండి: పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణం.. అంబటి ఫైర్