
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు అక్రమాలపై విచారణ చేపట్టాలని మాజీ మంత్రి కాకాని గోవర్థనరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాని గోవర్థనరెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘అక్రమాలు చేసి అడ్డంగా దొరికిన దొంగలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారు. రాజధాని భూముల నుండి స్కిల్ స్కామ్ వరకు అక్రమాలు చేశారు. సీఐడీ అధికారులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించారని వారిపై కక్ష కట్టారు. సీనియర్ ఆఫీసర్లను చంద్రబాబు వేధిస్తున్నారు. ఆయనపై కేసులు ఉన్న శాఖల్లో తన గుప్పిట్లో ఉండే ఆఫీసర్లను నియమించుకున్నారు. అప్పటి కేసులను నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కేసుల నుండి తప్పించుకోవటానికి ప్లాన్ వేశారు
అందుకోసమే ఢిల్లీ నుండి న్యాయవాదులను రప్పించి అధికారులకు సూచనలు ఇప్పటిస్తున్నారు. చంద్రబాబు జైలు నుండి విడుదల అయ్యే సమయంలో కోర్టుకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులపై ఛార్జిషీట్లను కూడా వేయటం లేదు. సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించినా కూడా ప్రభుత్వ న్యాయవాది వాయిదాలు కోరుతున్నారు.
చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ షరతులను కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు సరఫరా చేసిన పెండ్యాల శ్రీనివాసరావు అప్పట్లో అమెరికా పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ను పిలిపించి కీలక బాధ్యతలు అప్పగించారు.
స్కిల్ కేసులో పూణే, ముంబాయి, ఢిల్లీలో ఈడీ సోదాలు చేసి ఆధారాలు సేకరించింది.షెల్ కంపెనీల ద్వారా రూ.332 కోట్లు చంద్రబాబుకు చేరాయి. అధికారులు అనేక రకాలుగా అభ్యంతరాలు చెప్పినా చంద్రబాబు ఒత్తిడి చేశారు. తనకు చెందిన షెల్ కంపెనీలకు ఆ నిధులు వచ్చేలా చూసుకున్నారు.ఫైబర్ నెట్ ఫ్రాడ్‌ను కూడా అలాగే కుట్ర పూరితంగా చేశారు. వేమూరి హరికృష్ణకు కాంట్రాక్టు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించారు
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో భారీగా భూదోపిడీ చేశారు.చంద్రబాబు, నారాయణ ఇందులో కీలక నిందితులు. కానీ ఆ కేసును మూయించటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులపై ఏపీలో విచారణ జరిగితే న్యాయం జరగదు. రాష్ట్రం బయటే ఈ కేసుల విచారణ జరగాలి’అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment