న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమవ్వగా.. కిషన్‌రెడ్డి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోనే ఉన్నా సమావేశానికి హాజరు కాలేదు. ఇటు మంత్రిత్వశాఖ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్లలేదు. దీంతో కేంద్ర మంత్రిత్వపదవికి ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ బాధ్యతలు కిషన్ రెడ్డికి, పక్కలో ఈటల
ఇక కిషన్ రెడ్డి 2021 నుంచి కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. అంతకుముందు 2019 మే 30 నుంచి 2021 వరకు హోం వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణకు ముందే కిషన్ రెడ్డి అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడించవచ్చు. కాగా పలు రాష్ట్రాల సారథులను మారుస్తూ బీజేపీ అధిష్టానం మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించింది. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అప్పగించింది.
(చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారంటే.?)
బాధ్యతలు ఇచ్చారు కానీ అధికారం అంతంతేనా?
అయితే తెలంగాణ అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించాక ఇప్పటి వరకు ఆయన స్పందించనూ లేదు. మీడియాతో మాట్లాడటానికి సైతం నిరాకరిస్తున్నారు. ఇప్పటి వరకు లేని ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవిని ఇప్పుడెందుకు సృష్టించారని, పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వకుండా బాధ్యతలు ఎలా ఉంటాయన్న భావనలో కిషన్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా.. ఈటల రాజేందర్ రూపంలో మరో పోటీదారు కిషన్ రెడ్డికి ఉన్నట్టే.
రేపటి ఎన్నికల్లో అభ్యర్థులను ఎవరు ఖరారు చేస్తారు?
తెలంగాణ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి డిసెంబర్ తో ముగియనుంది. ఇప్పుడున్నది జులై. అంటే ముందున్న నాలుగు నెలలు ఎన్నికల వాతావరణమే. ఇప్పటివరకు చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులెవరో తెలియని పరిస్థితి. ఇక ఇప్పటికే బండి సంజయ్ కొందరికి హామీ ఇచ్చినా.. పార్టీ ఆమోద ముద్ర ఎంత వరకు వేస్తుందన్నది అనుమానమే. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు విషయంలోనూ పార్టీ అధిష్టానం ఎవరిపై ఆధారపడుతుందన్నది జవాబు లేని ప్రశ్నే.
సమన్వయం సవాలే
అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నా.. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఈటల తన వంతుగా కొన్ని పేర్లు తీసుకురావొచ్చు. అలాగే ఇతర పార్టీల నుంచి కొంత మందిని తీసుకురావాలన్నది ఈటల వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లో అసమ్మతి నేతలను తమ వైపుకు తిప్పుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుందన్నది ఈటల భావనగా కనిపిస్తోంది. పార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంలో ఈటల వ్యూహం పట్ల సానుకూలంగా ఉంది. అయితే ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసిన కరడు గట్టిన కమలనాథులు ఈ విషయంలో కిషన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది.
చదవండి: బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్ స్థానంలో భూపేంద్రయాదవ్?
Comments
Please login to add a commentAdd a comment