
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్
దర్యాప్తు సంస్థలు సుమోటోగా విచారణ చేపట్టాలి
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
మాజీ సీఎం కేసీఆర్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల సంఘం, గవర్నర్, ఇతర దర్యాప్తు సంస్థలు సుమోటోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ ద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. దీనిపై గవర్నర్ ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు.
అలాగే గతంలో ఎన్నికల నిబంధనలు బీఆర్‌ఎస్ ఉల్లంఘించినందున ఈసీ కూడా జోక్యం చేసుకోవాలన్నారు. 2014 నుంచి ఎన్నికలు, ఇతర సందర్భాల్లో పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినందున బీఆర్‌ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు కారణం ఎవరో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక షాడో సీఎం గా వ్యవహరించిన కేటీఆర్ ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ట్యాపింగ్‌తో రూ. కోట్లు వసూలు చేశారు..
ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రయత్నం చేసినా బీజేపీ విడిచిపెట్టబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రిటైరైన ఓ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించి కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం మామూలు విషయం కాదన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల ఫోన్లతోపాటు, బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల ఫోన్లను బీఆర్‌ఎస్ నేతలు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ రూ. కోట్లలో వసూళ్లు చేసినట్లు, ఇందులో కేసీఆర్, అయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు బయటపడుతోందని వ్యాఖ్యానించారు. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
రైతు హామీలను కాంగ్రెస్ అమలు చేయదేం?
రైతులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఎందుకు అమలు చేయట్లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వలేదు. రుణమాఫీ ఏ డిసెంబర్ 9న చేస్తారో తెలియదు? రైతులకు రూ. 500 బోనస్ బోగసేనా? రైతులకు కొత్త రుణాలు ఎందుకు ఇవ్వట్లేదు’అని ఆయన నిలదీశారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment