ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ ఎవరి మధ్య జరగబోతోంది?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో జగనే పోటీ పడుతున్నారన్న సంగతి చెబితే ఆశ్చర్యం కలగవచ్చు. కాని అది నిజం. ఇంతకాలం జగన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నారన్న భావన ఉండేది. ఎన్నికల కార్యక్షేత్రంలో పరిస్థితులు, సర్వేల విశ్లేషణలు చూసిన తర్వాత అర్దం అయింది ఏమిటంటే జగన్ తన ప్రత్యర్ధులకు అందనంత దూరంలో ఉన్నారని..
ఆయన ప్రజాదరణలో అంతగా ఎదిగారన్నమాట. రాజకీయ పార్టీలుగా వైఎస్ ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో పోటీ పడుతున్నట్లు కనబడుతున్నప్పటికీ, వాస్తవానికి పోటీ అంతా ముఖ్యమంత్రి జగన్ కేంద్రంగానే జరుగుతోంది. ఈ ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలా?వద్దా? అన్నదే చర్చ తప్ప, జగన్ కాకపోతే మరెవరు అన్న చర్చ లేదు. కొంతకాలం క్రితం వరకు జగన్ కావాలా? చంద్రబాబు కావాలా? అన్న దానిపై ప్రజలు మాట్లాడుకునేవారు. కాని ఇప్పుడు జగన్ ఒక్కరిపైనే చర్చించుకుంటున్నారు. జగన్ ను సమర్ధించడమా? లేక వ్యతిరేకించడమా? అన్నదే ప్రధాన అంశంగా ఉంది. అంటే జగన్‌తో జగనే పోటీ పడుతున్నారన్నమాట. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి?
చంద్రబాబు ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. ఆయన ఏమిటో చూశారు. ఇప్పుడు ఆయన కావాలా? వద్దా? అన్నదానితో నిమిత్తం లేదు. ప్రస్తుతం జగన్‌కు ఆయన ప్రత్యామ్నాయం గా కనిపించడం లేదు. జగన్ కాకపోతే మరెవ్వరు అన్న ప్రశ్న వస్తుంది కనుక ఆయన ఒక ఆప్షన్‌గా మాత్రమే కనిపిస్తున్నారు. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఐదేళ్లపాటు కాస్త శ్రమించి తన పార్టీని నిలబెట్టుకున్నా, ఆయన కూడా మరో ఆప్షన్ గా జనానికి కనిపించేవారు. ఆ అవకాశాన్ని ఆయన చేజేతులారా జారవిడుచుకున్నారు. బీజేపీతో కలిసి పవన్ ఒక ఆప్షన్ అవుతారన్న అనుమానంతోనే ఆయనను చంద్రబాబు తన ట్రాప్ లోకి లాగారు. దాంతో పవన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి రేసులో లేకుండా పోయారు.
చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పి అవమానించినా, పవన్ కళ్యాణ్ పడి ఉన్నారంటే, పరిస్థితిని గమనించవచ్చు. చంద్రబాబు తన చొక్కా పట్టుకుని తిరిగే వ్యక్తిగా పవన్ ను మార్చివేశారు. దాంతో ఆయన అభిమానులు , కాపు సామాజికవర్గం కాని నిస్పృహకు లోనైంది. దాని ప్రభావం పడి టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టినా విజయావకాశాలు కనిపించడం లేదు. అదే టైమ్‌లో ముఖ్యమంత్రి జగన్ విపక్షనేత చంద్రబాబుకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. జగన్ మొదటి ర్యాంకులో ఉంటే, చంద్రబాబు మొదటి పది ర్యాంకులలో ఎక్కడా కనిపంచడం లేదు. అందువల్లే జగన్‌కు చంద్రబాబు పోటీగా నిలబడలేకపోతున్నారు. జగన్ రోడ్ షో లలోకాని, సభలలో కాని జనం నుంచి వస్తున్న స్పందన చూడండి. అది స్వచ్చందంగా కనిపిస్తుంది. ఎంతో అభిమానం కనిపిస్తుంది.
ఒకసారి జగన్‌తో మాట్లాడితే చాలు.. అన్న చందంగా ప్రజలు పోటీ పడుతున్న తీరు జగన్ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. జగన్ తనను కలవడానికి వచ్చేవారితో కలిసిపోతున్న వైనం, వృద్దులు,పిల్లలు, మహిళలు.. ఇలా ఒకరేమిటి? అందరిని పలకరిస్తూ, షేక్ హాండిస్తూ,సెల్ఫీలు ఇస్తూ, వారితో ముచ్చటిస్తూ బస్ యాత్రలు చేస్తున్నారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు రోడ్ షోలు నిర్వహించలేకపోతున్నారు. సభలు పెట్టలేకపోతున్నారు. వచ్చిన జనంలో కూడా అంత స్పందన కనిపించడం లేదు. పైగా ఆయన చెప్పే విషయాలను జనం నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. ఆయన ఏది పడితే అది మాట్లాడి నవ్వులపాలు అవుతున్నారు. లేదా ప్రజాగ్రహానికి గురి అవుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌కు తానే ఫౌండేషన్ వేశానని ఆయన చెబుతుంటే, ఇదేమిటి.. కులి కుతుబ్ షా కదా అని వెంటనే సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి.
ప్రపంచంలో ఏ దేశంలో తెలుగువారు ఉన్నా, అదంతా తనవల్లే అని చెప్ప్పడం చూసినవారికి ప్రజలను పిచ్చివాళ్లని అనుకుంటున్నాడా అన్న సందేహం వస్తుంది. మద్యం తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు దేశంలో ఈయన ఒక్కరే కావచ్చు. వలంటీర్ల వ్యవస్థపై అనేక విష ప్రచారాలు చేసి,చివరికి వారి సేవలు వృద్దులకు అందకుండా చేసిన చంద్రబాబు, యు టర్న్ తీసుకుని తాను కూడా వలంటీర్లను కొనసాగిస్తానని చెబుతున్నారు. వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ నోరు తెరవడం లేదు. చంద్రబాబు తరపున పనిచేసి ఆయన ప్రజల దృష్టిలో విలన్ అయ్యాడు. ఇలా ఒకటి కాదు.. అనేక విషయాలలో చంద్రబాబు మాట మార్చడం అలవాటుగా చేసుకున్నారు. ప్రజలు వీటన్నిటితో విసిగిపోయారు.
ప్రధాని మోదీని పరుష భాషలో దూషించి ఏకంగా టెర్రరిస్టుతో పోల్చడం, తిరిగి కాళ్ల, వేళ్లాపడి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మోదీని కూటమి సభలో ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించడం.. ఇవన్ని చంద్రబాబు పరువును మసకబార్చాయి. అదే జగన్ ఎక్కడా ఎవరిని తూలనాడకుండా, పిచ్చి ప్రకటనలు చేయకుండా తను పాలనలో ఏమి చేసింది చెప్పగలుగుతున్నారు.తాను మంచి చేశానని అనుకుంటేనే ఓటు వేయండని చెప్పిన ఏకైక నేత దేశంలో ఒక్క జగనే అంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు తన పాలన గురించి చెప్పుకోలేక జగన్‌ను వ్యక్తిగతంగా దూషించి, ఏది పడితే అది మాట్లాడి పలచన అవుతున్నారు.
టిప్పర్ డ్రైవర్‌కు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారా అని వారిని అవహేళన చేసి లక్షలాది మంది డ్రైవర్ల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. రావులపాలెంలో కిరాణా షాపులలో గంజాయి అమ్ముతున్నారంటూ పిచ్చి ఆరోపణ చేసి కిరాణా షాపులవారి, ముఖ్యంగా వైశ్య సంఘాల ఆగ్రహానికి చంద్రబాబు గురయ్యారు. జగన్‌ను తాను ఒక్కడినే ఎదుర్కోలేనని తెలుసుకుని చంద్రబాబు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారన్న విషయం ప్రజలకు బోధపడింది. అంటే దీనిని బట్టి జగన్ ఎంత శక్తిమంతుడుగా మారింది తేటతెల్లమైందన్నమాట.
ఇదే విషయాన్ని పలు సర్వేలు సైతం ధృవీకరిస్తున్నాయి. మూడు పార్టీల కూటమి ఏర్పడిన తర్వాత కూడా తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వే వైసీపీకి 21-22 లోక్ సభ సీట్లు వస్తాయని అంచనా వేసిందంటే జగన్ ఎంత ఎత్తున ఉన్నది ఊహించుకోవచ్చు. అలాగే జన్ మత్ మరికొన్ని సర్వేలు కూడా జగన్ విశేషమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నారని చెబుతున్నాయి. అయినప్పటికి జగన్‌ను వ్యతిరేకించేవారు ఉండరా అన్న సందేహం రావచ్చు. ఏ ప్రభుత్వం అయినా, ఏపార్టీ అయినా ఎంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. అది ఏ స్థాయిలో ఉందన్నదే ప్రశ్న. ఆ రకంగా చూసినప్పుడు జగన్ పనితీరును అరవై నుంచి డెబ్బై శాతం మంది మెచ్చుకుంటున్నారు.వైసీపీకి మొత్తం ఓట్లలో ఏభై శాతం ఇప్పటికీ మద్దతు కొనసాగుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, సీట్ల సర్దుబాటు గొడవల తర్వాత టీడీపీ గ్రాఫ్ మరింత తగ్గిందని చెబుతున్నారు. బీజేపీతో పొత్తుతో మైనార్టీ వర్గాలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తత్ఫలితంగా ఐదు నుంచి పదిశాతం ఓట్లు టీడీపీ కోల్పోబోతోందని అంచనా. జగన్ తన స్కీముల ద్వారా డబ్బు వృధా చేస్తున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రచారం చేశారు. కాని చిత్రంగా జగన్ ఇస్తున్నదానికంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఇస్తామని వాగ్దానం చేస్తూ ప్రజల దృష్టిలో చులకన అయిపోయారు. దీంతో టీడీపీకి మద్దతు ఇచ్చేవారికి ఈ పాయింట్‌పై వాదించే పరిస్థితి లేకుండా పోయింది.
సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని వర్గాల మద్దతు పొందడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. అదే టైమ్‌లో వైఎస్ జగన్ తనకు 2019లో మద్దతు ఇచ్చిన వర్గాలన్నిటిని తనతోనే క్యారీ చేసుకోగలుగుతున్నారు. జగన్ ప్రాంతం చూడను.. పార్టీ చూడను. కులం చూడను.. మతం చూడను.. అర్హత ఉంటే స్కీములు అమలు చేస్తామని చెప్పి అదే ప్రకారం చేశారు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం తన పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టి ప్రజలను పీడించారు. 2014లో ఎన్నికైన వెంటనే కలెక్టర్ల సమావేశం పెట్టి తన పార్టీవారికే పనులు చేయాలని ఆదేశించారు.
రాజకీయాలలో నలభై ఐదేళ్ల సీనియర్ అయిన చంద్రబాబు పెత్తందారి మనస్తత్వానికి, పదేళ్ల క్రితం రాజకీయాలలోకి వచ్చి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడి అధికారంలోకి వచ్చిన జగన్ పేదల పక్షపాతి అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈ నేపధ్యంలో గత ఐదేళ్లుగా చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేసినా, పలుమార్లు మాట మార్చుతూ రావడంలో వాటికి విలువ లేకుండా పోయింది. అంతేకాక చంద్రబాబు నాయుడు ప్రజల కన్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను నమ్ముకుని, పొత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుండగా, జగన్ మాత్రం జనాన్ని నమ్ముకుని, ఒంటరి పోరాటం చేస్తూ, తన పాలనపై అచంచల విశ్వాసంతో రాజకీయం చేస్తున్నారు. ఆ తేడా వల్లే చంద్రబాబు పూర్తిగా వెనుకబడిపోగా, జగన్ బాగా ముందుకు వెళ్లిపోయారు. ఇప్పుడు జగన్‌ను చంద్రబాబు ఢీకొట్టలేకపోతున్నారు. అందువల్లే జగన్‌తో జగనే పోటీ పడుతున్నారని విశ్లేషించవలసి వస్తుంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment