ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను అభినందించాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తీరు అభినందనీయం. ఎక్కడా ఆయన పక్షపాతానికో, పార్టీ అభిమానానికో అవకాశం ఇవ్వలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా మెచ్చుకోవాలి. ఫిరాయింపు వ్యవహారాలపై స్పీకర్ విధులలో జోక్యం చేసుకుని ఎలాంటి ఒత్తిడికి ఆయన అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్ష తెలుగుదేశంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు, అధికార వైఎస్సార్‌సీపీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. సాధారణంగా ఇలాంటి కేసులలో సభ్యులకు ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే చట్టం ప్రకారం అనుసరించవలసిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది. అయినా ఏదో సాకు చూపుతూ ఫిరాయింపు సభ్యులు స్పీకర్‌కు వివరణలు ఇస్తూ పోతారు. స్పీకర్ కూడా వారు ఎలాగైనా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కనుక చూసి, చూడనట్లు వ్యవహరిస్తుంటారు.
అయితే ముఖ్యమంత్రి ఒత్తిడి ఉంటే మాత్రం చకచకా అనర్హత వేటు వేస్తుంటారు. అలాగే లోక్ సభ,లేదా రాజ్యసభలలో అధికారపక్షానికి తలనొప్పి కలిగిస్తున్నారంటే మాత్రం వెంటనే అనర్హత వేటు వేస్తుంటారు. వెంకయ్యనాయుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యసభలో శరథ్ యాదవ్ పదవిపై వేటు వేసిన తీరు విమర్శలకు గురి చేసింది. ఒక చోట వేరే పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా ఆయనపై వేటు వేశారు. అదే టీడీపీ సభ్యులు నలుగురు బీజేపీలో చేరితే మాత్రం దానిని విలీనంగా గుర్తించి, రాజ్యాంగ స్పూర్తిని వెంకయ్య నాయుడు నీరుకార్చారు. అయినా ఆయన ఏపీ, తెలంగాణలలో పర్యటిస్తూ ఫిరాయింపులకు వ్యతిరేకంగా, నైతిక విలువలపైన ప్రసంగాలు చేస్తుంటారు.
ఇక లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంగతి చూద్దాం. నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజును అనర్హుడిని చేయండని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసినా, పలుమార్లు గుర్తు చేసినా ఆయన ఎలాంటి చర్య తీసుకోకుండా కథ నడిపేశారు. కనీసం పార్లమెంటు గడువు ముగుస్తున్న చివరి రోజులలో సైతం ఆయనను అనర్హుడిని చేయలేదు. నైతిక విలువల గురించి సుద్దులు చెప్పే భారతీయ జనతా పార్టీ తీరు ఇలా ఉందని అనుకోవాలి. సుమారు నాలుగేళ్లుగా రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీ వ్యతిరేక కార్యకలాపాలలో ఉంటున్నారు. పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన ఏ మాత్రం పద్దతిగల వ్యక్తి అయినా, తానే రాజీనామా చేసి ఉండాల్సింది. స్పీకర్ ఓం బిర్లా కూడా ఆయనపై చర్య తీసుకోలేదు. ఆ స్థాయిలో రఘురామకృష్ణంరాజు మేనేజ్ చేసుకోగలిగారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడమే అని చెప్పాలి.
ఓం బిర్లా లోక్ సభ స్పీకర్ అయినా, ఆయన కంటే ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ బెటర్‌గా వ్యవహరించారని చెప్పవచ్చు. ఇందులో కూడా వివక్షకు తావు లేకుండా చేశారు. అధికార వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో పాటు, టీడీపీలో గెలిచి వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిలపై కూడా అనర్హత వేటు వేశారు. చివరి సెషన్ తర్వాత వేసినా, దీనిని ఒక సింబాలిక్ గా తీసుకోవాలి. ఫిరాయింపులు చేస్తే ఎప్పటికైనా అనర్హత వేటు పడుతుందన్న సంకేతం వెళ్లాలి. ఇందులో ఆలస్యం చేయడం సరైనదేనా అని అడిగితే కాదని చెప్పకతప్పదు. కానీ అసలు చేయనిదానికంటే ఇది మెరుగు కదా అని సరిపెట్టుకోవాలి. టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని రాజ్యసభ ఎన్నికలలో కుట్ర కథ నడపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయత్నించకపోలేదు.
ఆయనకు అండగా ఉండే ఈనాడు రామోజీరావు కొద్దిరోజుల క్రితం ఏమి రాశారో గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యసభ ఎన్నికలలో అధికారపార్టీ నిలబెట్టే అభ్యర్దులకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారేమోనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వణికిపోతున్నారని రాశారు. అంతే తప్ప, ఫిరాయింపులను చంద్రబాబు లేదా మరెవరైనా ప్రోత్సహించడం తప్పని రాయలేదు. ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంజాయిషీ నోటీసులు ఇవ్వగానే, దానిని వ్యతిరేకిస్తూ, రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే భయపడి ఈ నోటీసులు ఇచ్చారని టీడీపీ, ఈనాడు ప్రచారం చేశాయి. అంటే రాజ్యసభ ఎన్నికల కోసం గతంలో ఎమ్మెల్యేలను కొన్నట్లు మళ్లీ కొనుగోలు చేయాలని టీడీపీ ప్రయత్నం చేసిందన్నమాటే కదా! వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దీనిపై కోర్టుకు కూడా వెళ్లినా ఫలితం దక్కలేదు. తదుపరి బలం లేకపోయినా, రాజ్యసభకు పోటీచేయాలనుకున్న టీడీపీ తోక ముడవడం ఈనాడుకు పెద్ద షాక్ అయింది. తాము అనుకున్నట్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వణకలేదే అని తెగ బాధపడింది.
ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదాల తర్వాత తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. అధికార పార్టీకి మద్దతు ఇచ్చిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడడం వైఎస్సార్‌సీపీకి కాస్త ఇబ్బందే. అయినా విలువలకు కట్టుబడి వారిని అనర్హులను చేశారు. దీంతో టీడీపీ ఎలాంటి విమర్శలను చేయలేకపోయింది. గత టరమ్‌లో కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్నప్పుడు తెలుగుదేశంకు అమ్ముడుపోయిన 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చర్య తసుకోవాలని ఆ పార్టీ గట్టిగా కోరినా ఆయన వారిపై అనర్హత వేటు వేయలేకపోయారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఫిరాయింపు దారులకు మద్దతుగా నిలవడమేకాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా అని చెప్పాలి. విలువల గురించి కథలు చెప్పే చంద్రబాబు ఇంత అనైతికంగా వ్యవహరించినా, శాసనసభలో సభ్యుల ప్రవర్తన గురించి సంపాదకీయాలు రాసి, నీతులు చెప్పే రామోజీరావు టీడీపీ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఒక్క విమర్శ చేయలేదు. అది ఆయన చిత్తశుద్ది. పైగా ఆ రోజులలో చంద్రబాబు చేస్తున్న అభివృద్దిని చూసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎగబడి వస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు.
1995లో టీడీపీ వ్యవస్థాపకుడు, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి రామారావును పదవినుంచి లాగిపడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఫిరాయింపు చట్టాన్ని ఆసరాగా చేసుకుని, ఎన్.టి ఆర్ పక్షాన ఉన్న కొందరుఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు టీడీపీకి మెజార్టీ వచ్చేసినందున, ఎన్.టి.ఆర్ గ్రూపులో ఉండేవారిపై అనర్హత వేటు పడుతుందన్న భయాన్ని కల్పించేవారు. తద్వారా అందరూ తనవైపు వచ్చేలా చేసుకున్నారని అంటారు. టెక్కలి ఉప ఎన్నికలో గెలిచిన అప్పయ్యదొర చాలారోజులు చంద్రబాబు గ్రూపునకు వ్యతిరేకంగా ఉండేవారు. ఆ టైమ్‌లో ఆయనకు ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆనాటి స్పీకర్ యనమల నోటీసు ఇచ్చినట్లు గుర్తు. కొంతకాలం విచారణ కూడా చేశారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు టీఆర్ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వారిని నేరుగా పార్టీలోకి వైఎస్ తీసుకోలేదు. అయినా వారు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంగా అనర్హత వేటుకు గురయ్యారు. దానిపైన సుదీర్ఘకాలం వాదోపవాదాలు సాగాయి.
చివరికి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి అనర్హత వేటు వేశారు. వేటు పడడానికి ఒకరోజు ముందు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటువేసిన వారిపై వెంటనే వేటు వేయడానికి అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ జంకారు. ఉప ఎన్నికలు జరగడానికి అవకాశం లేదనుకునే సమయం వరకు వేచి చూసి ఆ తర్వాత చర్య తీసుకున్నారు. దానికి కారణం అప్పట్లో సొంత పార్టీ పెట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు మద్దతుగా రాజీనామా చేసిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం రెండు మాత్రమే గెలుచుకోవడం. దాంతో అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన సుమారు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా కాలయాపన చేసి, కొత్త రాజకీయం చేశారు.
కానీ వైఎస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి అన్ ఫెయిర్ రాజకీయాలకు తావివ్వడం లేదు. ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా వారిని ఆకర్షించడానికి, కొనుగోలు చేయడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. నలుగురు మాత్రం తమంతట తాము వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారిని కూడా అధికారికంగా పార్టీలో చేర్చుకోలేదు. వైఎస్సార్‌సీపీలో అసమ్మతి ఎమ్మెల్యేలుగా మారిన నలుగురిపై కూడా స్పీకర్ ప్రత్యేకంగా చర్య తీసుకోలేదు. మొత్తం ఎనిమిది మందిపై కలిపి ఓకేసారి స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు.
కాగా మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సుమారు రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దానిని ఆయన ఉపసంహరించుకోలేదు. స్పీకర్ ఫార్మాట్‌లో చేసిన రాజీనామాను అమోదించాలని కోరుతున్నట్లు ఆయన ప్రకటనలు కూడా చేశారు. దాంతో కొద్దికాలం క్రితం స్పీకర్ తమ్మినేని ఆమోదించడంపై మాత్రం గగ్గోలు పెట్టారు. రాజ్యసభ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి లబ్ధి కోసమే ఇలా ఆమోదించారని ఆరోపించారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా ఉత్తుత్తిగానే రాజీనామా చేశారని అనుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఒకేసారి చర్య తీసుకుని కొత్త ప్రమాణం నెలకొల్పారని చెప్పాలి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుల
Comments
Please login to add a commentAdd a comment