రానున్న లోక్ సభ ఎన్నికలు పలు విశేషాలు, ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా జరగనున్నాయి. జూన్ 1న చివరి దశ ఓటింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు జూన్ నెలలో పోలింగ్ జరగడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. దేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగిన 1951-52 తర్వాత ఇవే సుదీర్ఘమైన లోక్‌సభ ఎన్నికలు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 మధ్య దాదాపు నాలుగు నెలల పాటు లోక్‌సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు 68 దశల్లో జరిగాయి.
1991లో జూన్‌లో ఓటింగ్
1991లో మాత్రమే లోక్‌సభ ఎన్నికలు జూన్ నెలలో జరిగాయి. ఆ సంవత్సరం మార్చి 13న కేంద్రంలోని ప్రధానమంత్రి చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దయిన తర్వాత మే 20, జూన్ 12, జూన్ 15 తేదీల్లో ఓటింగ్ జరిగింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మూడు రాష్ట్రాల్లో పోలింగ్ వాయిదా పడింది. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ ఎన్నికలు మే నెల తర్వాత జరగలేదు. 2019లో పోలింగ్ చివరి తేదీ మే 19 కాగా ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. 2014లో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు మే 12 వరకు జరిగాయి. ఫలితాలు మే 16న ప్రకటించారు. 2009లో చివరి దశ పోలింగ్ మే 13న జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment