డీకే శివకుమార్‌కు మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Minister KTR Strong Political Counter To DK Shiva Kumar | Sakshi
Sakshi News home page

డీకే శివకుమార్‌కు మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Sun, Oct 29 2023 10:37 AM | Last Updated on Sun, Oct 29 2023 3:05 PM

Minister KTR Strong Political Counter To DK Shiva Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కౌంటరిచ్చారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా? అంటూ ప్రశ్నలు సంధించారు. 

కాగా, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..
‘డీకే గారు.. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. 

దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం  సిగ్గుచేటు. అది మీ చేతకానితనానికి నిదర్శనం.

మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు. 

ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా.. ?  

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు విశ్వసించరు.  

ఎన్నికల ప్రచారంలో  ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. 

మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది.

కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్‌లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు.

రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది. 

మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారింది. 

సబ్ స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు.. కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ ఘోర పరిపాలనా వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలు. 

మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టింది. ప్రతీ ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే  మీ హామీ కూడా గంగలో కలిసిపోయింది. 

కర్ణాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోంది.

కర్ణాటకలో సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవడానికి మా ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డ’ అని కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement