
సాక్షి, విశాఖపట్నం: పెగాసస్‌ను చంద్రబాబు ఎవరి కోసం కొన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియతో మాట్లాడుతూ.. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని పేర్కొన్నారు. పెగాసస్ వెనుక ఎవరెవరు ఉన్నారో వెలికితీయాలని అన్నారు.
ఈ సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ఏం చేశారో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎవరి సంభాషణలు వినడానికి పెగాసస్ కొన్నారో తెలియాలని మండిపడ్డారు. ఇతరుల ఫోన్ సంభాషణలు దొంగతనంగా వినడం క్షమించరాని నేరమని దుయ్యబట్టారు. చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు అని ఎద్దేవా చేశారు.
బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వయంగా చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాన్ని బయట పెట్టిందని గుర్తుచేశారు. పెగాసస్ స్పైవైర్ కొనుగోళ్లు కుట్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. ఎవరి రహస్యాలు తెలుసుకోవడానికి చంద్రబాబు ఈ వ్యవహారం చేశారో బయటకు రావాలన్నారు. ఇది కేవలం ఏపీ వ్యవహారం కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా కేంద్రం భావించాలని తెలిపారు.
ఈ టెక్నాలజీ ద్వారా కేవలం ఫోన్ సమాచారం మాత్రమే కాదు ఎన్నో రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందని మండిపడ్డారు. ఇంత పెద్ద నేరానికి పాల్పడిన చంద్రబాబుపై చర్యలు అవసరమని అన్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో సెక్షన్ 8 గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ఓ సీనియర్ సీఎం మమత బెనర్జీ స్వయంగా చెప్పిన దశలో చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మండిపడ్డారు.