
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై హత్యా యత్నం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. పెద్దల ఒత్తిడితో పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారని శివకొండారెడ్డి అన్నారు.
నాపై హత్యాయత్నం వెనుక లక్కిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తి ఏ1గా ఉన్నారు. ఏ1 రవితేజ ఎవరికి సన్నిహితుడో, వీరవిధేయుడో అందరికీ తెలుసు అంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేస్తూ.. నిందితుడు ఆ కుటుంబానికి వీరవిధేయుడని శివకొండారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల వద్దకు వెళ్తా.. వారే నాకు న్యాయం చేయాలని శివకొండారెడ్డి అన్నారు.
కాగా, అధికార తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకు విలువ లేకుండా పోయిందని కొందరు... కష్ట నష్టాలకు ఓర్చుకున్న వాళ్లకు దిక్కు దివానం లేకుండా పోయిందని ఇంకొందరు ఆవేదనలో ఉన్నారు. ఎమ్మెల్యే మనుషులం, మేము చెప్పిందే వేదమని నడిమంత్రపు హోదాతో మరికొందరు రెచ్చిపోతున్నారు. ఈక్రమంలో పరస్పర దాడులు తెరపైకి వస్తున్నాయి. ముద్దనూరు, కడప ఘటనలు అందులో భాగమేనని తెలుస్తోంది. సానపురెడ్డి శివకొండారెడ్డిపై హత్యాయత్నం ఘటన కూడా అందులో భాగమేనని తెలుగు తమ్ముళ్లు బాహాటంగా చెప్పుకు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment