నూజివీడు: ‘మీరు ఇచ్చే హామీలు నెరవేరుస్తామని హామీపత్రం రాసివ్వండి. లేకపోతే మీకు ఓటు వేయం...’ అంటూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిని ఓ వృద్ధురాలు నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కె.పార్థసారథి శనివారం నూజివీడులోని 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... స్థానికులు తమ గృహాలు చెరువు పోరంబోకు స్థలంలో ఉన్నాయని, వాటికి పట్టాలు ఇప్పించాలని కోరారు.
దీనిపై పార్థసారథి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే నివేశన స్థలాలకు పట్టాలు ఇప్పిస్తామని, లేనిపక్షంలో పొజిషన్ సర్టిఫికెట్లు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో స్థానికంగా నివాసం ఉంటున్న తులసమ్మ అనే వృద్ధురాలు జోక్యం చేసుకుని ‘నోటి మాట చెబితే కుదరదు. రాతపూర్వకంగా హామీపత్రం రాసివ్వాలి. లేకపోతే ఓట్లు వేయం’ అని చెప్పారు. దీంతో తులసమ్మతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈలోపు కొందరు స్థానికులు జోక్యం చేసుకోవడంతో వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment