దేశ రాజధాని ఢిల్లీలోని ఆ లోక్‌సభ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారో వారే కేంద్రంలో అధికారం చేపడతారట. కొన్నాళ్లుగా ఇలానే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ ఈ స్థానం. 2009 పార్లమెంట్ ఎన్నికలకు కొంతకాలం ముందు ఈ సీటు ఉనికిలోకి వచ్చింది. ఈ స్థానంపై ఇప్పటి వరకు మూడు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో ఎన్నికలకు ఈ స్థానం ఎదురు చూస్తోంది.
ఈ సీటుకు సంబంధించిన అత్యంత విశేషమేమిటంటే ఈ సీటును గెలుచుకున్న పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. 2009లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2014, 2019లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది.
గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను నిలబెట్టడంతో ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. అయితే ఈసారి బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కమల్‌జిత్ సెహ్రావత్, కాంగ్రెస్ మద్దతు కలిగిన ఆప్ నేత మహాబల్ మిశ్రా మధ్య గట్టిపోటీ నెలకొంది. 2014లో ఆప్ రెండో స్థానంలో ఉండగా, 2019లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని బీజేపీ రెండుసార్లు సొంతం చేసుకుంది.
2014లో బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ 2.68 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన అత్యధికంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి బీజేపీ వర్మకు టికెట్ కేటాయించలేదు. బీజేపీకి చెందిన సెహ్రావత్‌కు ఇవి మొదటి లోక్‌సభ ఎన్నికలు. ఒకవేళ సెహ్రావత్ ఎన్నికైతే ఆమె ఈ స్థానానికి తొలి మహిళా ఎంపీ అవుతారు.
పశ్చిమ ఢిల్లీ 24.88 లక్షల మంది ఓటర్లు కలిగిన అతిపెద్ద లోక్‌సభ స్థానం. దేశ రాజధాని ఓటర్లలో ఇది దాదాపు 17 శాతం. ఇందులో 13.27 లక్షల మంది పురుషులు, 11.61 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్న లోక్‌సభ స్థానం కూడా ఇదే. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో పది అసెంబ్లీ స్థానాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment