హైదరాబాద్, సాక్షి: ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కనుంది. ఇప్పటికే అధికార, ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరిట సభలు పెడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల సంగతి సరేసరి. ఇక జనసేన పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నాడు.
ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా పవన్ మళ్లీ వారాహి యాత్ర చేపట్టబోతున్నాడు. గతంలో.. వారాహి పేరుతో విడతల వారీగా రాష్ట్రం తిరుగుతానంటూ హడావిడి చేసిన పవన్, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ వాహనాన్ని పక్కన పడేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి తరఫున 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు దక్కించుకున్న పవన్.. ఇంకా మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థుల్నే ఖరారు చేయలేదు. ఈలోపే ఎన్నికల ప్రచారంలోకి దిగుతుండడం గమనార్హం.
రాజీనామాల పర్వం
జనసేన టికెట్లకు సంబంధించి పలుచోట్ల రగడ నడిచింది. పవన్ తనకు మాటిచ్చి తప్పారని.. అలాంటి నిలకడలేని మనిషితో కొనసాగలేనంటూ ముమ్మిడివరం జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ జనసేనకు గుడ్‌బై చెప్పారు. ఇక రాజోలులో దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి బొంతు రాజేశ్వరరావు సిద్ధమయ్యారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనే జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు మాకినేని శేషు కుమారి. మరోవైపు టికెట్ దక్కకపోవడంతో కాకినాడ సిటీలో స్తబ్దంగా మారిపోయారు జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్. ఇక.. జనసేన నాయకుల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి మరీ పార్టీకి రాజీనామా చేశారు కాకినాడ మాజీ మేయర్ కవికొండల సరోజ. ఇంకోవైపు.. పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పాఠం శెట్టి సూర్యచంద్ర.
నిరసనలు తప్పవా?
పవన్ తన వారాహి యాత్రను ఇవాళ పిఠాపురంలో ప్రారంభించబోతున్నాడు. ఇక్కడి నుంచే పవన్ పోటీ చేస్తున్నాడన్నది తెలిసిందే. అయితే పవన్ ఎన్నికల ప్రచారానికి జనసేన నుంచే ఓవైపు అసమ్మతి.. మరోవైపు నిరసనలు సెగలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ తొలి నుంచి ఉన్నవాళ్లకు పవన్ మొండి చేయి చూపించాడు. ధన బలం ఉన్న నేతలకే సీట్లు ఇచ్చాడనే విమర్శను ఎదుర్కొంటున్నాడు. మరోవైపు వలస నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని కూడా కేడర్ భరించలేకపోతుంది. పోతిన మహేష్ లాంటి నమ్మకస్తుడికి అసలు టికెట్ దక్కకపోవడంపై కేడర్ రగిలిపోతోంది. దీంతో పవన్ ప్రచారానికి ఆయా చోట్ల ఆటంకాలు ఎదురు కావొచ్చని తెలుస్తోంది.
ఇన్ని ప్రతికూలతల నడుమ.. పవన్ తన ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తారు? అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు పిఠాపురంలో తనకు మొదటి నుంచి పోటీగా వస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను చల్లబర్చడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. ఇవాళ వర్మ ఇంటికి వెళ్లిన పవన్.. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలనే ఎంచుకుని.. పర్యటన, సభలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment