రామగుండం నియోజకవర్గం
రామగుండం నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే, ఆర్టిసీ చైర్మన్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ ఓటమి చెందగా, టిఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్ది పార్వర్డ్ బ్లాక్ టిక్కెట్ పై పోటీచేసిన కురుగంటి చందర్ విజయం సాదించారు. చందర్ 2014 ఎన్నికలలో పోటీపడి ఓడిపోయారు.కాని 2018 ఎన్నికలలో విజయం సాధించగలిగారు. ఆ తర్వాత చందర్ టిఆర్‌ఎస్‌లో చేరిపోవడం విశేషం. చందర్‌కు 61400 ఓట్లు రాగా, సోమారపు సత్య నారాయణకు 34981 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే చందర్‌కు 26419 ఓట్ల మెజార్టీ రావడం ఒక ప్రత్యేకతగా భావించాలి. కాగా ఇక్కడ కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ఇరవైఆరువేలకు పైగా ఓట్లు వచ్చాయి. చందర్ మున్నూరుకాపు వర్గానికిచెందిన నేత.
రామగుండం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009 ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందిన సోమారపు సత్యనారాయణ 2014లో టిఆర్‌ఎస్ పక్షాన గెలిచారు. 2009లో గెలిచిన తర్వాత కొంతకాలం కాంగ్రెస్ ఐలో ఉన్నా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రం అవడంతో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. గతంలో రామగుండం, మేడారం రిజర్వుడ్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. మేడారంలో పదిమంది ఎస్.సి.నేతలు గెలుపొందగా, జనరల్‌గా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్లు గెలిచారు. మేడారం నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి నాలుగు సార్లు, టిడిపి మూడుసార్లు, టీఆర్‌ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. మేడారం, రామగుండం ఒకే నియోజకవర్గంగా భావిస్తే, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచినట్లవుతుంది.
1983లో ఇక్కడ గెలిచిన మాతంగి నరసయ్య 1989లో కాంగ్రెస్‌ఐ పక్షాన, 1999లో టిడిపి తరుపున గెలుపొందారు. ఈయన 1984లో నాదెండ్ల భాస్కరరావు గ్రూపులోను, 1996లో ఎన్.టి.ఆర్ టిడిపి పక్షాన ఉన్నారు. 1985లో మేడారంలో గెలిచిన మాలం మల్లేషం 1994లో కూడా గెలుపొందారు. 1972, 78లలో జి.ఈశ్వర్ గెలిచారు. ఈయన సీనియర్‌నేత, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన వెంకటస్వామికి సమీప బంధువు 1967లో ఇక్కడ గెలిచిన గడిపల్లి రాములు 1957,62లలో హుజూరాబాద్‌లో విజయం సాధించారు. మాతంగి నరసయ్య 1984లో నాదెండ్ల వెంట ఉన్నప్పుడు నెలరోజుల మంత్రిగా పనిచేసారు. మేడారం జనరల్ స్థానంగా ఉన్నప్పుడు 1962లో ఎమ్. రామగోపాలరెడ్డి ఇండిపెండెంటుగా గెలిచారు. ఈయన నిజామాబాదు నుంచి మూడుసార్లు లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు.
రామగుండం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment