
రేపు ఉదయం 8 వరకు కూటమి ఊహల్లో విహరించవచ్చు: సజ్జల
ఆ తర్వాత సంబరాలు చేసుకునేది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే
ఘోర ఓటమిని గ్రహించే పోలింగ్ నుంచి చంద్రబాబు నిశ్శబ్దం
కౌంటింగ్ అధికారులనూ లొంగదీసుకోవడానికి కుట్ర
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనకు మెచ్చిన ప్రజలు వైఎస్సార్‌సీపీకి మరోసారి అఖండ విజయాన్ని చేకూరుస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి సానుకూలత ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైందని, అవి ఊహించిన దానికంటే అధిక స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోíష్టిగా మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. నిరంతరం మీడియాలో ప్రచారం కోసం వెంపర్లాడే చంద్రబాబు ఘోర ఓటమిని గ్రహించే పోలింగ్ నుంచి ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉండిపోయారని చెప్పారు. బీజేపీ భజన చేసే రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ఎన్డీయేకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని, వాటిని చూసి టీడీపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.
ఈనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటల వరకూ వారు సంబరాలు చేసుకోవచ్చని వ్యంగ్యోక్తులు విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోతే టీడీపీ కార్యాలయంలో శ్మశాన నిశ్శబ్దం నెలకొంటుందని వ్యాఖ్యానించారు.
ఈసీని అడ్డుపెట్టుకుని డ్రామాలు
ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు ఈసీని అడ్డుపెట్టుకుని డ్రామాలాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఓట్ల లెక్కింపులోనూ అరాచకాలకు పాల్పడేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రల పట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వైఎస్సార్‌సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడిస్తే కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ఎన్డీయే భజన చేశాయని విమర్శించారు. వాటిని చూస్తే నవ్వొస్తోందన్నారు. తమిళనాడులో కాంగ్రెస్ తొమ్మిది చోట్ల పోటీ చేస్తే 13 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.
రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానాలోనూ ఉన్న లోక్‌సభ స్థానాల కంటే ఎన్డీయే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించాయన్నారు. తప్పుల తడక లాంటి ఆ ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విశ్వసనీయత లేదని సజ్జల స్పష్టం చేశారు. కచ్చితంగా వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment