ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తాజాగా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ రెండోదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో గృహిణులైన మహిళందరికీ సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా సీఎం భూపేష్ బఘేల్ రూ.15,000 ప్రకటించినట్లుగా భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మహిళా సాధికారత కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు రాయ్‌పూర్‌లో విలేకరులతో పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు ‘ఛత్తీస్‌గఢ్ గృహలక్ష్మి యోజన’ కింద ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని బఘేల్ ప్రకటించారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ నవంబర్ 7న ముగిసింది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment