సాక్షి, అమరావతి: సెల్‌ఫోన్‌లో టార్చ్‌లైట్‌ను కనిపెట్టింది తానేనంటూ పదేపదే చెప్పుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ పిట్టలదొర అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 45 రోజులుగా రాఖీలకు పూజ చేస్తున్నానని, వాటిని కట్టుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయంటూ పగటి వేషగాడిలా చాదస్తం మాటలు చెబుతున్న చంద్రబాబు గొప్ప విజనరీ అంటూ ఎద్దేవా చేశారు.
సజ్జల శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. వార్థక్యంతో మతి భ్రమించి మాట్లాడుతున్న చంద్రబాబును సీఎంగా చేయడానికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని విమర్శించారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న చంద్రబాబు గురించి రాష్ట్ర ప్రజలు ప్రతికూలంగానైనా రోజూ చర్చించుకుంటూనే ఉంటారని చెప్పారు. విజన్ 2047 పేరుతో హామీలను 2014 – 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను ఎడాపెడా పెంచేసి ఇప్పుడు తగ్గిస్తానంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు.
విడిపోతే కదా మళ్లీ కలవడానికి..?
చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని, వారిద్దరూ ఆది నుంచి కలిసే ఉన్నారని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సజ్జల బదులిచ్చారు. ‘అసలు చంద్రబాబు – పవన్ విడిపోతే కదా మళ్లీ కలవడానికి? 2014లో చంద్రబాబును సీఎంగా చేయడం కోసం జనసేనను ఎన్నికల బరిలోకి దించకుండా పవన్ బేషరతుగా టీడీపీకి మద్దతిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా మళ్లీ చంద్రబాబును సీఎంగా చేయడం కోసమే 2019లో పవన్ విడిగా పోటీ చేశారు’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని చెప్పడం ద్వారా టీడీపీతో కలిసి పోటీ చేస్తానని పవన్ చెప్పకనే చెప్పారన్నారు.
విశాఖకు రాజధాని రాకూడదన్నదే వారి లక్ష్యం..
సీఎం జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం చూసి ఓర్వలేకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. విశాఖలో చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను సీఎం జగన్ చక్కదిద్దుతున్నారని, వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని తెలిపారు.
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు అక్కడ శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ ఆర్కిస్ట్ర్ లో సభ్యుడైన పవన్ నాలుగు రోజులుగా ఫిడేలు వాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు. యార్లగడ్డ వెంకట్రావుకు ఏవైనా సమస్యలుంటే తన వద్దగానీ, ప్రాంతీయ పరిశీలకులు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, సీనియర్ నేతల వద్ద అంతర్గతంగా చర్చించుకోవాలని, బహిరంగ వేదికలపై చర్చించకూడదని చెప్పారు.
ప్రజాబలం ఉన్న వైఎస్సార్‌సీపీలో ఒక స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడటం సహజమేనన్నారు. ఇప్పుడు పోటీ చేయడానికి అవకాశం రాకపోతే భవిష్యత్‌లో వస్తుందని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడాలని స్పష్టంచేశారు. యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకుని మాట్లాడినట్లుగా ఉందన్నారు. పార్టీ నుంచి వెళితే వెళ్లిపో అని తానెప్పుడూ అనలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment