ఎంపీ కారుపై చెప్పులు, పిడిగుద్దులతో దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు
కిందకు దిగాలంటూ ఎంపీ సురేష్‌ను బూతులు తిట్టిన వైనం
దెబ్బతిన్న కారు.. పోలీసులకు ఫిర్యాదు
యద్దనపూడి: ప్రచారం నిమిత్తం వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై పర్చూరు నియోజకవర్గ పరిధిలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం దాడికి తెగబడ్డారు. ఎంపీ ప్రయాణిస్తున్న కారును అడ్డగించి చెప్పులు విసిరారు. ఎంపీపైనా, వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనా పిడిగుద్దులతో దాడికి దిగారు. సుమారు గంటపాటు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మార్టూరు మండలం వలపర్ల ఎస్సీ కాలనీలో పర్యటన నిమిత్తం ఎంపీ నందిగం సురేష్ యద్దనపూడి నుంచి ర్యాలీగా మార్టూరు వైపు బయలుదేరారు. సాయంత్రం 3.45 సమయంలో చింతపల్లి చేరుకున్నారు.
ఇంతలో టీడీపీ ఎన్నికల ప్రచార ర్యాలీ ఎదురుపడింది. దీంతో ఎంపీ తన వాహనంతో పాటు వెనుక వచ్చే వాహనాలను సైతం పక్కకు ఆపారు. ఎంపీ వాహనాన్ని గమనించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సమీపానికి రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. చెప్పులు తీసి ఎంపీ కారు అద్దాలపై కొడుతూ కారులో ఉన్న ఎంపీని బూతులు తిట్టారు. నీ అంతు చూస్తామంటూ రాయడానికి వీలుపడని పదజాలంతో దూషించారు. టీడీపీ కార్యకర్తలు ఎంపీ కారుపైకిఎక్కి కాళ్లతో కారు పైభాగాన్ని తన్నుతూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
అప్పటివరకు సంయమనం పాటించిన ఎంపీ సురేష్ కారు దిగి కారుపై ఉన్న వారిని కిందకు దిగాలని కోరారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు జెండా కర్రలతో ఆయనపైన, అనుచరులపైన దాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన ఎంపీ నందిగం సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని పంపించి వేశారు. దాడి నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతపల్లిపాడు నుంచి యనమదల మీదగా యద్దనపూడి పోలీస్‌స్టేషన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు.
అనంతరం సీఐ సీతారామయ్య, ఎస్సై జీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు 15 మంది టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఎంపీపై దాడి విషయం తెలుసుకున్న వందలాది మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు స్టేషన్‌కు చేరుకున్నారు.
ఓటమి భయంతోనే దాడులు
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ.. ‘ఎన్నికల ప్రచారం కోసం చింతపల్లిపాడు మీదుగా మార్టూరు మండలం వలపర్ల వెళ్తుండగా టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. చింతపల్లిపాడులో టీడీపీ ర్యాలీ జరుగుతుండటతో నా కారును పక్కన పెట్టుకుని ఉండగా.. కొంతమంది టీడీపీ నాయకులు నా కారును మోటార్ సైకిళ్లతో చుట్టుముట్టారు.
కాళ్లతో నా కారును ఎగిరెగిరి తన్నటం ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు నా కారును చుట్టుముట్టి నానాబూతులు తిట్టడం మొదలెట్టారు. దీంతో నేను కారు దిగి కారును ఎందుకు గుద్దుతున్నారని ప్రశ్నించగా.. వారిలో ఓ వ్యక్తి సీఎం జగన్‌ను దూషించటమే కాకుండా వాడు పోటీ చేయించేవాడు, నువ్వు పోటీ చేసేటంత వాడివా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించటం ప్రారంభించాడు. మరో నెల రోజులు ఆగండి. మా అమరావతి పవర్ ఏమిటో చూపిస్తా’మంటూ బూతులు తిట్టారు.
వివాదాలు దేనికని భావించి పక్కకు తొలగండని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. దీనిని చూసి అక్కడకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రావటంతో కొంత వెనక్కి తగ్గారు. నేను ఇంకొల్లు సీఐకి సమాచారమిచ్చాను. ఈలోగా కొందరు మహిళలు నాకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని చెప్పారు. ‘టీడీపీ నాయకులు ఆడవాళ్లు అని కూడా చూడకుండా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు.
ఈ విషయంపై గతంలో కూడా ఎస్సీ కాలనీ వాసులు తమపై రోజురోజుకూ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ఘటనతో టీడీపీ అరాచకాలను ప్రత్యక్షంగా చూశాను. ఇదేవిధంగా ఉంటే మమ్మల్ని ఓట్లు వేయినిస్తారా అని ఎస్సీలు చెప్పటం చూస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ద్వారా మాకు చాలా ప్రమాదం పొంచి ఉందని ప్రజలు చెబుతున్నారంటే ఇక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి’ అని ఎంపీ నందిగం వివరించారు.
టీడీపీ నాయకులు ఎన్ని అవరోధాలు, అవాంతరాలు స్పష్టించినా 13న జరిగే ఎన్నికల పోలింగ్‌లో పర్చూరు ఎమ్మెల్యేగా యడం బాలాజీ, ఎంపీగా తాను, సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును అపటం ఎవరితరం కాదన్నారు. యడం బాలాజీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా భౌతిక దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇలా రెచ్చగొట్టేలా దూషించటం, దాడులకు పాల్పడటం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment