కొందరు అభ్యర్థుల ప్రకటన తర్వాత అనంతపురం జిల్లా తెలుగుదేశంలో కుమ్ములాటలు మరింత పెరిగాయి. టిక్కెట్లు ఆశించి భంగపడినవారు అధినేతపై భగ్గుమంటున్నారు. కోట్లు ఇచ్చినవారికే టిక్కట్లా అని దుమ్మెత్తి పోస్తున్నారు. అసమ్మతి నేతల్ని పిలిచి సర్దుకుపోవాలని సూచించినా టీడీపీ క్యాడర్ ఖాతరు చేయడంలేదు. పార్టీ కోసం కష్టపడింది ఎవరు? కోట్లు ఇచ్చి సీట్లు తన్నుకుపోయింది ఎవరు?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొమ్మిది సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అభ్యర్థులు ఖరారైన వెంటనే పలు నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుమంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం, శింగనమల, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిని ఆ పార్టీ ఉమెన్ కమిటీ వ్యతిరేకిస్తోంది. బండారు శ్రావణికి ఎట్టిపరిస్థితుల్లో సహకరించేది లేదని శింగనమల నియోజకవర్గ టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుకు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు స్పష్టం చేస్తున్నారు. శింగనమల అసమ్మతి నేతలు ఇటీవల జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు.
మరోవైపు కళ్యాణదుర్గం టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు కొంతకాలంగా పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరినీ కాదని కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబునాయుడు. వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా తీసుకున్న చంద్రబాబు కాంట్రాక్టర్‌కు టిక్కెట్ ఇచ్చారనే ప్రచారం టీడీపీ వర్గాల్లోనే జరుగుతోంది. అమిలినేని సురేంద్రబాబుకు టిక్కెట్ ఇవ్వటంపై పోటీ కోసం ప్రయత్నిస్తున్న రెండు వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. అటు మడకశిర నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తన మనిషికి టిక్కెట్ ఇప్పించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి చేసిన లాబీయింగ్ పనిచేయలేదు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్ కు టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో మడకశిర నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు ముకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు.
పెనుకొండ నియోజకవర్గానికి వస్తే మాజీ ఎమ్మెల్యే, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న బీకే పార్థసారథిని పక్కనపెట్టారు చంద్రబాబునాయుడు. పెనుకొండ అభ్యర్థిగా మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురు సవితను ఖరారు చేశారు. దీంతో బీకే వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బీకే పార్థసారథిని పిలిచి చంద్రబాబునాయుడు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పార్థసారథికి ఎంపీ టిక్కెట్ వస్తుందని ఆయన వర్గం ఆశలు పెట్టుకుంది. అదీ రాకపోతే టీడీపీకి ముకుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో బీకే వర్గం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఎంపీ టిక్కెట్ వచ్చినా పెనుకొండలో సవితకు సహకరించకూడదని బీకే పార్థసారథి లోలోన కుట్రలు చేస్తున్నట్లు టీడీపీలోనే చర్చ జరుగుతోంది.
మరోవైపు మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం సైతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాప్తాడు అభ్యర్థిగా పరిటాల సునీతను ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడు ఆమె తనయుడు పరిటాల శ్రీరాం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ధర్మవరం టీడీపీ ఇంఛార్జిగా పరిటాల శ్రీరాం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ధర్మవరం టిక్కెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకోసం చంద్రబాబుకు వంద కోట్లు ఇచ్చేందుకు ఇప్పటికే మంతనాలు కూడా చేసినట్లు టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
టీడీపీలో టికెట్ల కుమ్ములాట.. చంద్రబాబుపై అసమ్మతి నేతల ఫైర్!
Published Sun, Mar 3 2024 12:38 PM | Last Updated on Sun, Mar 3 2024 5:32 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment