జిల్లాల పునఃర్విభజనతో ఏర్పడిన హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బిన్నరాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులే పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో అదృష్ట్యాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు :
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నగరంలోని హన్మకొండ కాజీపేట ప్రాంతాలను కలుపుకుని ఉంది. కాకతీయుల నాటి చెరువులు కుంటలు కబ్జాకు గురికావడంతో వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు ముంచెత్తడం.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, స్మార్ట్ సిటిగా పేరొందినప్పటికి మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, నిలువనీడలేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ళు అందకపోవడం.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ అమలుకు నోచుకోకపోవడం వంటి అనేక సమస్యలు నగర ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. విద్యావంతులు మేధావులు, రాజకీయ నేతలకు నిలయంగా ఉన్న హన్మకొండ రాజకీయం ప్రత్యేకతను చాటుకుంటుంది. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే నేతలైనా, అధికారులైనా వారి నివాసాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రమైన హన్మకొండలోనే ఉన్నాయి. కానీ సమస్యలకు పుట్టినిల్లుగా అనేక సమస్యలతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు :
బీఆర్‌ఎస్
- దాస్యం వినయ్ భాస్కర్ (సిట్టింగ్ ఎమ్మెల్యే)
కాంగ్రెస్
- నాయిని రాజేందర్‌రెడ్డి
- జంగా రాఘవరెడ్డి
బీజేపీ
- రావు పద్మ
- ఏనుగుల రాకేష్
- ధర్మారావు
వృత్తిపరంగా ఓటర్లు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నగర ప్రాంతం కావడంతో ఉద్యోగులు వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. శివారు కాలనీల్లోరైతులు ఉన్నప్పటికి వారిప్రభావం పెద్దగా ఉండదు.
మతం/కులం పరంగా ఓటర్లు
హిందువులు ఎక్కువగా ఉంటారు. బిసి జనాబా ఎక్కువగా ఉంది. 30 వేల మంది రెడ్డి ఓటర్లు ఉంటారు. ఎన్నికల్లో రెడ్డి ఓట్లు కీలకంగా మారుతాయి.
నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు :
గ్రేటర్ వరంగల్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గం అధికార పార్టీ బిఆర్ఎస్కు కలిసొచ్చే స్థానంగా చెప్పుకోవాలి. పశ్చిమ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పశ్చిమలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. 2009 నుంచి టీఆర్ఎస్‌కు పశ్చిమలో వినయ్ భాస్కర్ తప్ప మరో వ్యక్తి లేడనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్‌కు టికెట్ దక్కింది. ప్రస్తుతం ప్రభుత్వ చీప్ విప్‌గా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. పదవులకు తోడు కాంగ్రెస్, బిజేపిలోని గ్రూప్ రాజకీయాలు వినయ్ భాస్కర్‌కు అనుకూలంగా మారుతున్నాయి. హంగు ఆర్బాటం లేకుండా అందరితో కలివిడిగా ఉండే వినయ్ భాస్కర్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుంది. ప్రత్యర్థి పార్టీలోని గ్రూప్ రాజకీయాలు ఆయనకు కొండంత అండగా నిలువనున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు వినయ్ భాస్కర్కి అంత ఈజీగా ఉండవన్న చర్చ ప్రజల్లో సాగుతుంది.
అభివృద్ది సంక్షేమం విషయంలో నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు నగరంలో జరిగినప్పటికి ఇంకా కొన్ని పనులు పెండింగ్లోనే ఉన్నాయి. అభివృద్ది సంక్షేమ ఫలాలు కొందరికే పరిమితం కావడంతో వినయ్ భాస్కర్కు మైనస్‌గాగా మారుతుంది. బాల సముద్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణం పూర్తై రెండేళ్ళు కావస్తున్న ఇంకా లబ్దిదారులకు అప్పగించకపోవడతో గృహ ప్రవేశం కాక ముందే ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. లబ్దిదారులకు అప్పగించకపోవడానికి ప్రధాన కారణం నిర్మించిన ఇళ్ళు 596 అయితే లబ్దిదారులు ఐదు వేలకుపైగా ఉండడంతో లబ్దిపొందేవారికంటే ఇళ్ళ కెటాయింపు జరిగితే శత్రువులుగా మారే వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో లబ్దిదారుల ఎంపికలో ఆలస్యం అవుతుంది. 31వ డివిజన్ శాయంపేటలో మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం.. అప్పగింతలో ఆలస్యం అవడంతో కమ్యూనిష్టులతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది.
కమ్యూనిష్టులు ఏకంగా నగర శివారులోని ప్రభుత్వ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారు. నగరంలో నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కెటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కాజీపేట కోచ్ ప్యాక్టరీ హామీ నెరవేరకపోవడం, కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు, పోతన కళాక్షేత్రం పనులు, చారిత్రాత్మకమైన వేయి స్థంబాల గుడి కళ్యాణమండపం పనులు మూడు అడుగులు మందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉండడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. భద్రకాళి అమ్మవారి ఆశిస్సులతో భద్రకాళి బండ్ పనులు పూర్తై ప్రజల వినియోగంలోకి రాగ ఆలయ మాడవీదుల పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అర్హులైన వారందరికి అందితే ఇక వినయ్ భాస్కర్ విజయానికి తిరుగేఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు :
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంటుంది. బీఆర్ఎస్ సిట్టింగ్‌ల ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు టికెట్ వరించడంతో ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలోని గ్రూప్ రాజకీయాలు అంతర్గత విబేధాలతో పోటీపడే వారు ఎక్కువ మంది ఉండడంతో వారిలోని పోటీ తత్వం గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీల కొంపముంచే అవకాశాలున్నాయని ఓరుగల్లు ప్రజలు భావిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నవారు చివరిక్షణంలో టిక్కెట్ దక్కకుంటే పార్టీ మారే అవకాశాలు సైతం లేకపోలేదని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్, బిజేపి లోని అనైక్యత బిఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశాలు మెండుకా ఉన్నాయి. అదే జరిగితే వరంగల్ పశ్చిమలో కారుజోరు బ్రేక్‌లులు ఉండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కొండలు అడవులులేవు ఆలయాలు మాత్రం కాకతీయులు నిర్మించిన వేయిస్థంభాల గుడి, భద్రకాళి అమ్మవారు ఆలయం ఉంది. పర్యాటకులను ఆకర్శించేలా వేయిస్థంభాల గుడి ఉంది. భద్రకాళి బండ్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment