Seven Perish In Bus Mishap In Prakasam District Of Andhra Pradesh - Sakshi
Sakshi News home page

మృతుల్లో చైన్నె డీఎస్పీ భార్య...

Published Wed, Jul 12 2023 1:08 AM | Last Updated on Wed, Jul 12 2023 8:13 PM

- - Sakshi

పెళ్లి సందడి సంతోషం.. అంతలోనే అంతులేని విషాదం. రిసెప్షన్‌ సంబరాలను ఊహించుకుంటూ బయలుదేరిన కొద్ది సేపటికే ఊహలు సమాధి అయ్యాయి. అర్ధరాత్రి..అంతా చిమ్మ చీకట్లు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఏడుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అప్పటి వరకూ తమతో సంతోషంగా గడిపిన వారు ఇకలేరు అన్న విషయం వారి బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. గాయపడిన ఆప్తులు ఒక వైపు, అయిన వారి మృతదేహాలు మరో వైపు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పొదిలికి తరలించిన సమయంలో వారి గృహాల వద్ద తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. దర్శి వద్ద సాగర్‌ కాలువలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన నాలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.

దర్శి/పొదిలి/పొదిలి రూరల్‌/కొనకనమిట్ల: పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీలో గౌస్‌ మొహిద్దీన్‌ కుటుంబం నివాసముంటోంది. ఆయన కుమారుడు సిరాజ్‌ సౌదీలో ఉంటున్నారు. వారితో పాటు ఆయన ఉంటున్నాడు. కుమార్తె ఫాతిమాను కాకినాడకు చెందిన అక్బర్‌ షరీఫ్‌తో వివాహం చేయాలని నిశ్చయించారు. వివాహం ఘనంగా జరపాలని తలంచారు. సౌదీ నుంచి అందరూ పొదిలికి చేరుకున్నారు. గత ఆదివారం పట్టణంలో అంగరంగ వైభవంగా కుమార్తె వివాహం జరిపించారు. రిసెప్షన్‌ కాకినాడలో పెట్టుకున్నారు.

బంధు మిత్రులను పొదిలి నుంచి తీసుకెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ డిపోకు చెందిన ఇంద్రా బస్సును అద్దెకు తీసుకున్నారు. రాత్రి పది గంటలకు బయలుదేరి, తెల్లవారి ఆరు గంటలకు కాకినాడ చేరుకుంటారు. పగలంతా ఫంక్షన్‌లో ఉండి, రాత్రికి బయలు దేరి పొదిలికి చేరుకోవాలనేది వారి ఆలోచన. ఒక్క డ్రైవర్‌ అయితే ఇబ్బంది ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి రెండో డ్రైవర్‌ కూడా అవసరమని చెప్పారు. ఇద్దరు డ్రైవర్లతో రాత్రి 12.15 గంటలకు బయలు దేరారు. బస్సులో బంధుమిత్రులు కొందరు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి కొందరు నిద్ర పోతున్నారు. సరిగ్గా బస్సు బయలు దేరిన 20 నిముషాల్లోపే ఒక్క సారిగా డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు కాలువలో ముందు వైపు కిందకు వేలాడినట్లు పడింది.

దీంతో బస్సులో ఉన్నవారంతా ఒక్క సారిగా ముందుకు పడ్డారు. ఒకరిపై ఒకరు పడి ఏం జరిగిందో అర్థం కాక హాహాకారాలు చేశారు. సీట్లలో నుంచి అందరూ ఒక్కసారిగా కింద పడి పోవడంతో ముందున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతా చిమ్మ చీకట్లు.. ఏం జరిగిందో తెలియక ఎలా బయటకు రావాలో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ వైపు నుంచి బయటకు వచ్చిన కొందరు తమ బంధువులకు ఫోన్‌లు చేసి జరిగిన విషయం తెలిపారు. బస్సు డ్రైవర్‌ రమేష్‌ 100కి సమాచారం అందించాడు.

అత్త, కోడలు మృతదేహాలు ఒకేసారి...
పెండ్లికుమార్తె పెద్ద మేనత్త ముల్లా నూర్జహాన్‌ (58), ఆమె కోడలు సబియా ప్రమాదంలో మృతి చెందారు. రెండు మృతదేహాలు ఒకే సమయంలో ఇంటి వద్దకు చేరుకోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. కోడలు పెళ్లి చూశాం.. రిసెప్షన్‌ కూడా చూసి రావాలని కాకినాడ బయలుదేరిన వారు, తిరిగిరాని లోకాలకు చేరారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

రిసెప్షన్‌కు వెళ్లి..అందరినీ చూడాలని...
పెండ్లికుమార్తె బంధువు అయిన ముల్లా జానీబేగం (65) రిసెప్షన్‌కు వెళ్లి బంధువులు అందరినీ చూడాలని బస్సులో బయలుదేరింది. కానీ దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. వయసు మీద పడుతోంది కదా.. అందరినీ చూడాలి అన్న ఆమె కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు చేరిందని కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఉపాధ్యాయుడు కాగా, మరొకరు రైల్వే పోలీసుగా పనిచేస్తున్నారు.

మృతుల్లో చైన్నె డీఎస్పీ భార్య...
పెండ్లికుమార్తె మేనత్త షేక్‌.రమీజ్‌ మృతుల్లో ఒకరు. రమీజ్‌ భర్త రియాజుద్దీన్‌ చైన్నెలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. వివాహం కోసం కుటుంబంతో సహా అందరూ పొదిలికి వచ్చారు. తదుపరి తాను కాకినాడకు బస్సులో రాలేనని చెప్పి, రైల్లో రిజర్వేషన్‌ చేయించుకుని బయలు దేరాడు. తెనాలి చేరే సరికి రియాజుద్దీన్‌కు బస్సు ప్రమాదం జరిగి, అందులో భార్య మృతి చెందిందనే వార్త చేరింది. అక్కడ నుంచి తిరిగి పొదిలికి చేరుకున్నారు. భార్య మృతదేహాన్ని చూసిన రియాజుద్దీన్‌, వారి కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. రమీజ్‌ మృతదేహాన్ని చైన్నెకి తరలించారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో మృతిచెందిన నూర్జహాన్‌ డీఎస్పీకి వదిన.

ఏం జరిగిందో...అర్థం కాలేదు:
చుట్టూ చీకటి, రాళ్లపై పడి ఉన్నాను. కొంత సేపు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. బస్సులో ఉన్న నేను రాళ్లపై ఎందుకు పడి ఉన్నానో అని తెలియని స్థితి. లీలగా ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయి. బస్సు వాగులో పడినట్లు గుర్తించాను. బంధువులు, సామానులు, డబ్బులు, సెల్‌ఫోన్లు ఎక్కడకెక్కడో పడిపోయి ఉన్నాయి. ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరి ఆడటం లేదు. జేబులో సెల్‌ ఉంది. 108, పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చాను. అద్దం పగులగొట్టుకుని బయట పడ్డాను. దూర ప్రాంతం కాబట్టి బస్సుకు రెండో డ్రైవర్‌ను కూడా పంపించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరాం. పొదిలి నుంచి 12.15లు బయలు దేరాం. బస్సు బయలు దేరిన 20 నిముషాల్లోపే ప్రమాదం జరిగింది. రెండో డ్రైవరే బస్సులోని వారిని చాలా మందిని కాపాడాడు. – ముల్లా షుకూర్‌, క్షతగాత్రుడు

ఎదురుగా వస్తున్న బస్సే ప్రమాదానికి కారణం
దర్శి: బస్సు ప్రమాదానికి ఎదురుగా వస్తున్న జతిన్‌ ట్రావెల్స్‌ బస్‌ కూడా కారణమని డీఎస్పీ అశోక్‌వర్ధన్‌ తెలిపారు. ప్రమాదానికి గురైన బస్‌తో పాటు జతిన్‌ ట్రావెల్స్‌ బస్‌పై కూడా కేసు నమోదు చేశారు. రెండు బస్‌లు ఎదురెదురుగా వేగంగా వచ్చాయని సాగర్‌ కాలువ బ్రిడ్జి పైకి వచ్చేసరికి రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. బస్సులు వేగం తగ్గించి ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కాదన్నారు. జతిన్‌ ట్రావెల్స్‌ బస్‌ వేగంగా రావడంతో ఢీకొంటుందనే అనుమానంతో బస్సును సైడుకు నడపడంతో పాత నీటి పైపులకు నిర్మించిన కంకర దిమ్మె తగిలి బస్సు అదుపు తప్పి ఎస్‌కేజే పవర్‌ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు నీరు వదిలే కాలువ బ్రిడ్జిని ఢీకొట్టి సుమారు 20 మీటర్ల లోతు ఉన్న కాలువలో బస్సు పడిపోయింది. దీంతో బస్సులోని వారు ఒకరిపై ఒకరు పడిపోయి బస్సులో ఇరుక్కుపోయారు.

వెంటనే స్పందించిన పోలీసులు
ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న డీఎస్పీ అశోక్‌వర్ధన్‌రెడ్డి నేతృత్వంలో సీఐ జే రామకోటయ్య, ఎస్సై రామకృష్ణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌, పొక్లెయిన్‌, బుల్డోజర్‌లను తెప్పించి బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసుకొచ్చారు. నిముషాల వ్యవధిలోనే ఐదు 108 వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. బయటకు తీసేవారిని పోలీసులు పరామర్శించి వారి పరిస్థితిని బట్టి ఆస్పత్రులకు తరలించారు. లగేజీలు కూడా వారి వారి కుటుంబీకులకు అప్పగించారు.

ఈలోపే కొందరు డ్రైవర్‌ వైపు డోరు నుంచి బయటకు రాగా మరి కొందరు లోపలే ఇరుక్కుపోయారు. లోపలి వైపు ఇరుక్కుపోయిన వారిని అగ్నిమాపక సిబ్బంది బస్సులోకి వెళ్లి బయటకు తీశారు. క్రేన్‌ సాయంతో కాలువలో నుండి రోడ్డు పైకి తీసుకొచ్చారు. ఆ తరువాత మృతి చెందిన 6 మృత దేహాలను క్రేన్‌ల సాయంతో బయటకు తీశారు.

బస్సు కింద ఇరుక్కుపోయిన చిన్నారి షీమాను అతికష్టం మీద వెలికి తీశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్పీ మలికాగర్గ్‌ ఉదయం 5 గంటలకే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. మృతుల బంధువులను ఓదార్చారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆమె ప్రమాద స్థలంలోనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement