కనిగిరి రూరల్: కనిగిరి – వెలిగండ్ల రహదారిలో రక్తపు మరకలు అంటుకుంటున్నాయి. నిత్యం వాహన రాకపోకలు సాగిస్తున్న ఈ రోడ్డు మార్గంలో గతంలో కే రాధ హత్య ఘటన, నేడు విద్యార్థిని బీ మంజుల హత్య చోటుచేసుకున్నాయి. ఒకే రహదారిలో రాత్రి 6–8 గంటల మధ్యలోనే హత్యలు జరిగాయి. అంతేగాక ప్రధాన రోడ్డుకు ఎక్కడో దూరంగా జన సంచారం లేని ప్రాంతాల్లో జరిగినవి కాదు. కనిగిరి టు వెలిగండ్ల నిత్యం ఈ రోడ్డు మార్గంలో వందల వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. పల్లె గ్రామాలన్నీ పక్క పక్కనే రోడ్డు వెంబడే ఉంటాయి. కానీ దుండగులు మాత్రం ఈ దారినే ఎంచుకుని హత్యలు చేస్తున్నారు.
అంతేగాక గతంలో హత్యకు గురైన రాధ మృతదేహం ప్రధాన రహదారిలో తారు రోడ్డుకు పక్కన 5 అడుగులు దూరంలోనే పడేశారు. అర్ధరాత్రి దాటే దాకా ఎవరూ గమనించ లేదు. గుర్తించలేదు. తాజాగా సోమవారం జరిగిన బీ మంజుల హత్యోదంతం కూడా అదే పరిస్థితి. కనిగిరి – వెలిగండ్ల ప్రధాన రోడ్డుకు 20 అడుగుల దూరంలో, కనిగిరి – సుల్తాన్‌పురం కాలినడక మార్గంలో రోడ్డుకు అడుగు దూరంలోనే మృతదేహం పడేశారు. మంజుల హత్య కూడా 6–7 గంటల మధ్యలోనే జరిగిందనేది పోలీసుల విచారణలో స్పష్టంగా తేలింది. దాన్నిబట్టి చీకటి పడక ముందే మంజుల హత్య జరిగిందని భావించవచ్చు.
పోలీసింగ్ మరింత పెరగాలి..
నాలుగు నెలల వ్యవధిలో ఒకే రోడ్డులో సుమారు 10 కి.మీల దూరంలో రోడ్డు పక్కనే రెండు హత్యలు జరగడం పట్ల కనిగిరిలో చర్చనీయాంశంగా మారింది. కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లేదా వెలిగండ్ల స్టేషన్ పరిధిలోని మొబైల్ టీం రాత్రి పూట కచ్చితంగా గస్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. వారంలో మూడు రోజులు కనిగిరి స్టేషన్ నుంచి వెలిగండ్ల వరకు, మరో మూడు రోజులు వెలిగండ్ల నుంచి కనిగిరి వరకు పోలీసింగ్ నిర్వహించి మరో నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అంతేగాక కనిగిరి–పామూరు రోడ్డులోని డిగ్రీ కళాశాల ప్రాంతంలో.. కనిగిరి–పొదిలి రూట్‌లోని లారీ ఆఫీస్ అవుట్ కట్స్ ఏరియాలో, కనిగిరి–కందుకూరు రోడ్డులోని చిన ఇర్లపాడు అవుట్ కట్స్ ఏరియాలో, గార్లపేట రోడ్డులోని క్వారీ అవుట్ కట్స్ ఏరియాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తప్పనిసరిగా ప్రతి రోజు పోలీస్ గస్తీ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment